రూ. 40.04 కోట్లతో విశాఖలో తీరవృద్ధి పనులు

రూ. 40.04 కోట్లతో విశాఖలో తీరవృద్ధి పనులు 
పోర్టు ఛైర్మన్‌  ఎం.టి.కృష్ణబాబు 

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ తీరంలో ఇసుక కోతల నిరోధానికి వీలుగా విశాఖ పోర్టు సామాజిక బాధ్యత కింద రూ. 40.04 కోట్ల వ్యయంతో తీరవృద్ధి (బీచ్‌ నరిష్‌మెంట్‌) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోర్టు ఛైర్మన్‌ ఎం.టి.కృష్ణబాబు పేర్కొన్నారు. శుక్రవారం ఆర్కే బీచ్‌రోడ్డులో తీరవృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతేడాది ప్రారంభమైన పనుల్లో భాగంగా రూ. 11.09 కోట్లతో 1.51 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తీరంలో వేసినట్లు తెలిపారు. సముద్రం లోపలి భాగంలో ఉన్న ఇసుకను గుర్తించి, తవ్వి తీసి తీరంలో వేసే పనులను ‘డ్రిడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ నిర్వర్తిస్తోందని పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి మూడు లక్షల క్యూబిక్‌ మీటర్ల అధికంగా ఇసుకను తీరంలో పోసేలా పనులు సాగుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది తీరవృద్ధి కార్యక్రమానికి రూ. 18.37 కోట్లు వ్యయం చేయనున్నట్లు వివరించారు. కురుసురా జలాంతర్గామి మ్యూజియం వద్ద కోత అధికంగా ఉన్నందున అక్కడే పనులు చేస్తున్నట్టు చెప్పారు. సాగర గర్భంలోని ఇసుకను తవ్వోడతో తవ్వి తీసి తీరంలో వేయడానికి వీలుగా 500 మీటర్ల పొడవైన నీటిలో తేలే పైపులైనును, 80 మీటర్ల స్టీల్‌ పైపులైనును వేసినట్లు తెలిపారు. ఈ పనులు వచ్చే నెల మొదటివారానికి పూర్తవుతాయని వెల్లడించారు. తీరంలో కోతల నివారణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నెదర్లాండ్స్‌కు చెందిన డెల్టారిస్‌ అనే కన్సల్టెన్సీ సంస్థను నియమించిందని, అది వచ్చే నైరుతి రుతుపవనాల సీజన్‌లో అధ్యయనం చేసి నివేదిక ఇస్తుందని తెలిపారు. 

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.