మహిమ గల చెంబు పేరుతో టోకరా 
ఆరుగురు ముఠా సభ్యుల అరెస్టు 

రామభద్రపురం, న్యూస్‌టుడే: మహిమ గల చెంబు పేరుతో లక్షలాది రూపాయలు టోకరా వేసేందుకు ప్రయత్నించిన ఆరుగురు ముఠా సభ్యులను రామభద్రపురం పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. దీనికి సంబంధించి ఎస్‌ఐ డీడీ నాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన వల్లేపు శేషగిరిని ఆరుగురు ముఠా సభ్యులు ఓ పథకం ప్రకారం మోసగించేందుకు ప్రయత్నించారు. తమవద్ద మహిమ గల చెంబు ఉందని దీన్ని ఇంట్లో ఉంచుకుంటే కోట్లకు పడగెత్తుతారని నమ్మబలికారు. మోసగించిన వారిలో పార్వతీపురానికి చెందిన శ్రీపతి కౌసల్య, నర్సీపురానికి చెందిన చింతాడ ప్రేమదాస్‌, బొబ్బిలికి చెందిన ఏగిరెడ్డి చిట్టినాయుడు, హైదరాబాద్‌కు చెందిన చింతాడ తేజ్‌మోహనరావు, బొబ్బిలికి చెందిన కోరాడ సీతారామ్‌, కొమరాడ మండలం దళాయపేటకు చెందిన గళావల్లి రవి ఉన్నారు. బాధితుడు శేషగిరితో రూ.1.13 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా రూ.30 లక్షలు తొలివిడతగా చెల్లించినట్లు చెబుతున్నారు. తానుమాత్రం పూర్తి డబ్బులు చెల్లించినా చెంబు ఇవ్వలేదని బాధితుడు శేషగిరి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముఠా సభ్యుల నుంచి సమాచారం సేకరించారు. బాధితుడు శేషగిరి విశాఖపట్నంలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి కావడంతో ముఠా సభ్యులకు అక్కడే పరిచయం ఏర్పడినట్లు ఎస్‌ఐ తెలిపారు. మహిమ గల చెంబుకు సంబంధించి బేరసారాలు రామభద్రపురంలో సాగినట్లు చెప్పారు. ఆరుగురు ముఠా సభ్యులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. వీరినుంచి చెంబు, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.

Page 3 of 3

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.