రామతీర్థం.. శివమయం

రామతీర్థం.. శివమయం 

రామతీర్థం(నెల్లిమర్ల), న్యూస్‌టుడే: ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం రామతీర్థంలో మంగళవారం మహాశివరాత్రి ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. భక్తజన సందోహంతో అంతటా శివమయం అయింది. రామాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తరలివచ్చిన భక్తులు రామాలయాన్ని, శివాలయాన్ని దర్శించుకున్నారు. తెల్లవారు జాము నుంచి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఉచిత దర్శనం, శీఘ్రదర్శనం, అంతరాలయ దర్శనాలకు ప్రత్యేక క్యూలైన్లను దేవాలయ సిబ్బంది ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారికేడ్లను నిర్మించారు. స్వామి దర్శనం చేసుకొని తిరిగి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా మొబైల్‌ మెట్లను ఏర్పాటు చేశారు. దీనివల్ల ఈ ఏడాది దర్శనాలు సాపీగా కొనసాగాయి. నెల్లిమర్ల నుంచి వచ్చే వాహనాలను సీతారామునిపేట వద్ద, రణస్థలం నుంచి వచ్చే వాటిని రామతీర్థం ఉన్నత పాఠశాల సమీపంలో నిలిపివేసి ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు నియంత్రించారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.