క్రీడాపోటీలు ఘనంగా ప్రారంభం 

నైర (శ్రీకాకుళం నగరం), న్యూస్‌టుడే: శ్రీకాకుళం గ్రామీణ మండలంలోని నైర ఎన్జీరంగా వ్యవసాయ కళాశాలలో ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్రస్థాయి బోధనేతర సిబ్బంది క్రీడాపోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డా. టి.వి.సత్యనారాయణ, ఎన్జీరంగా విశ్వవిద్యాలయం బోర్డు సభ్యులు చాపర గణపతి ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం నిర్వహణలో బోధనేతర సిబ్బంది సేవలు వెలకట్టలేనివన్నారు. పోటీల్లో భాగంగా విశ్వవిద్యాలయం పరిధిలో గల కృష్ణా, గోదావరి, సదరన్‌, స్కేల్స్‌ రెయిన్‌ఫాల్‌, ఎన్‌షాట్‌ జోన్‌ల నుంచి 240 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వాలీబాల్‌, క్రికెట్‌ పోటీల్లో స్కేల్స్‌ రెయిన్‌ఫాల్‌, ఎన్‌షాట్‌ల జోన్‌లు ఫైనల్‌కు చేరుకున్నాయి. మహిళా విభాగంలో జరిగిన చెస్‌ పోటీల్లో కృష్ణా ప్రథమ స్థానంలో నిలవగా సదరన్‌ ద్వితీయ స్థానంలో నిలిచింది. బాడ్మింటన్‌ పోటీల్లో గోదావరి ప్రథమ, కృష్ణా జోన్‌ ద్వితీయ స్థానంలో నిలిచాయి. చెస్‌, క్యారమ్స్‌ పోటీల్లో కృష్ణా జోన్‌ ప్రథమ, ఎన్‌షాట్‌ ద్వితీయ స్థానాలు సొంతం చేసుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా సామాజిక అటవీ విభాగం అధికారి బి.ధనుంజయరావు, కళాశాల డీన్‌ పి.వి.కృష్ణయ్య, యూనివర్సిటీ బోధనేతర సిబ్బంది సంఘం అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు, సంఘం నాయకులు పి.హెచ్‌.కరుణానిధి, విశ్వవిద్యాలయం పరిశీలకులు డా. ప్రతాప్‌రెడ్డి, కళాశాల పర్యవేక్షకులు బి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

రైల్వేజోన్‌ సాధించి తీరుతాం 

గుజరాతీపేట, శ్రీకాకుళం: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వేజోన్‌ ఇచ్చి తీరాల్సిందేనని ఎటువంటి పరిస్థితుల్లో రైల్వేజోన్‌ సాధించి తీరతామని పార్లమెంట్‌ సభ్యులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. బుధవారం స్థానిక ప్రజాసదన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న తమ డిమాండ్లను ఆమోదించాల్సిందేనని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు జోన్‌ లేకపోవడం వల్ల నిరుద్యోగులు, ఉద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారని ప్రతి విషయానికి ఒడిశా కుర్దా డివిజన్‌కు వెళ్లాల్సి వస్తుందన్నారు. జిల్లాలోని ఏడు రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మనోభావాలను గౌరవించాలని ఆయన కోరారు.

‘ఆదివాసీలపై పెట్టిన కేసులు రద్దు చేయాలి’ 

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌ వద్ద ఈ నెల 5న జరిగిన ఘటనకు సంబందించి ఆదివాసీ యువతపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా రద్దు చేయాలని ఆదివాసీ సేన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. నగరంలోని ఎన్జీఓ హోంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాటి ఘటనను సాకుగా తీసుకుని ఆదివాసీలపై ఏకపక్షంగా కేసులు నమోదు చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇతరులపై ఆదివాసీలు ఇచ్చిన ఫిర్యాదుల విషయంలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. బోయి, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 342వ ఆర్టికల్‌ ప్రకారం బోయి, వాల్మీకి జాతులను గిరిజన జాబితాలోకి కలిపే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా మత్స్యకారులను సమర్థించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. సమావేశంలో ఆదివాసీ సేన ప్రతినిధులు వి.యోగి, ఎస్‌.ఎచెరు, పి.పాపారావు, టి.నరసింహారావు, ఎ.రామారావు తదితరులు పాల్గొన్నారు.

©2019 APWebNews.com. All Rights Reserved.