కిడ్నీ బాధితుల కోసమే శుద్ధ జలాలు 
జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ 

శింగరకొండ (అద్దంకి), న్యూస్‌టుడే : కిడ్నీ బాధితుల సంక్షేమం కోసమే  జిల్లాలో ఎన్టీఆర్‌ సుజలస్రవంతి పథకం కింద  మూడు చోట్ల భారీశుద్ధ జల కేంద్రాలు మంజూరు అయ్యాయని జిల్లా కలెక్టర్‌ వాడరేవు వినయ్‌చంద్‌ అన్నారు. శింగరకొండ వద్ద ఏర్పాటు చేయనున్న భారీశుద్ధజల కేంద్రానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. నీటిపారుదలశాఖ కార్యపర్యవేక్షక ఇంజినీరు సంజీవరెడ్డి అధ్యక్షత జరిగిన సభలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అద్దంకి, చీమకుర్తి, సి.ఎస్‌.పురం (కనిగిరి)ల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఒక్కో కేంద్రం నిర్మాణానికి రూ.1.50 కోట్లు వెచ్చిస్తామని అన్నారు. సీఎం చంద్రబాబు,     మంత్రి నారా లోకేష్‌, ఎమ్మెల్యే రవికుమార్‌ ఈ పనుల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. జలసంరక్షణ పథకాన్ని ఈ నెల 12న కృష్ణాజిల్లాలో ప్రారంభించారని చెప్పారు.  శింగరకొండ    శుద్ధజలకేంద్రం ద్వారా అద్దంకి మండలంలో 11 గ్రామాలు, బల్లికురవ మండలంలో 10 గ్రామాల ప్రజలకు రక్షిత నీరు అందుతుందని తెలిపారు. స్మార్టు కార్డు ద్వారా  రూ.2 లకే 20 లీటర్ల మంచినీటిని అందిస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో స్టీలు తొట్లు ఏర్పాటు చేసి 21 వాహనాల ద్వారా మంచినీటి సరఫరా జరిపిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, నీటిపారుదశాఖ ఈఈ మర్దన్‌ఆలీ, డీఈ ఈడ్పుగంటి శ్రీనివాస్‌నెహ్రూ, ఏఈ రాజేష్‌, పంచాయతీకార్యదర్శి నాగేశ్వరరావు, గొట్టిపాటి మహేశ్వరరావు, స్థానిక నాయకులు మానం వీరాంజనేయులు, మాజీసర్పంచి ఎర్రిబోయిన వెంకటేశ్వర్లు, మురకొండ వాసు, నరసయ్య, చింతా వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమయం లేదు మిత్రమా..! 
ఇటు ప్రీ ఫైనల్‌.. అటు పబ్లిక్‌ పరీక్షలు 
సమాయత్తానికి పది విద్యార్థులకు లేని అవకాశం 
ఇంటర్నల్‌ మార్కుల కేటాయింపులోనూ గందరగోళం 
వెలిగండ్ల, న్యూస్‌టుడే 

పదో తరగతి పరీక్షల నిర్వహణ ఇటు విద్యార్థులు, ఆటు ఉపాధ్యాయులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రీ ఫైనల్‌ పరీక్షకు, పబ్లిక్‌ పరీక్షకు మధ్య కేవలం నాలుగు రోజులే గడువు ఉంది. దీంతో ఈ పరీక్షల్లో రాసిన తప్పొప్పులు తెలుసుకుని వాటిని అధిగమించేలా సమాయత్తమయ్యే అవకాశం విద్యార్థులకు లేకుండా పోయింది. దీనివల్ల చిన్నారులు ఆయోమయానికి గురవుతున్నారు. ఉపాధ్యాయులు దీనివల్ల ఉత్తీర్ణతా శాతం తగ్గుతుందేయోనని ఆందోళనకు గురవుతున్నారు. దీనికితోడు పదో తరగతి పరీక్షల్లో ఇంటర్నల్‌ మార్కులు కీలకంగా మారాయి. ఈసారి ఈ మార్కుల కేటాయింపుపై సరిమైన నిర్ణయం విద్యాశాఖ ఉన్నతాధికారులు తీసుకోకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.

ఇదీ జిల్లాలో పరిస్థితి... 
జిల్లాలోని 56 మండలాల్లోని పాఠశాలల నుంచి పదో తరగతి పరీక్షలకు ఈ ఏడాది సుమారు 22 వేల మందికి పైగా ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యార్థులు హాజరవుతున్నట్టు సమాచారం. గత పదో తరగతి విద్యార్థులకు విద్యా ప్రణాళిక ప్రకారం నాలుగు ఫార్మేటివ్‌ పరీక్షలు, రెండు సమ్మేటివ్‌ పరీక్షలు, ఒక ఫ్రీ ఫైనల్‌ పరీక్షలు సజావుగా సాగాయి. ఈ సంవత్సరం మొదల్లో నిర్వహించిన సమ్మేటివ్‌ పరీక్ష పేపర్లు లీకవటంతో వాటిని రద్దు చేశారు. సమ్మేటివ్‌ 1 పేరుతో జనవరిలో పరీక్షలు నిర్వహించారు. సమ్మేటివ్‌ -2 పరీక్షలు నిర్వహించ లేదు. ఫిబ్రవరి 26 నుంచి  మార్చి 10వ తేదీ వరకు ప్రీ ఫైనల్‌ నిర్వహించనున్నట్టు విద్యా శాఖ ప్రకటించి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 15వ తేదీ నుంచి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నాలుగు రోజుల్లో ఎలా సన్నద్ధం కావాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జగన్‌వి ఉత్తర కుమార ప్రగల్భాలు 
బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వినుకొండ సుబ్రహ్మణ్యం ఒంగోలు అర్బన్‌, న్యూస్‌టుడే: వైకాపా అధినేత జగన్‌వి ఉత్తమ కుమార ప్రగల్భాలని రాష్ట్ర బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌, బాపట్ల తెదేపా పరిశీలకుడు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వినుకొండ సుబ్రహ్మణ్యం విమర్శించారు. శుక్రవారం స్థానిక తెదేపా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌ ప్రజల సొమ్ము దోచుకొని పలు ఆర్థిక నేరాల్లో నిందితుడిగా ఉన్నారని, ఆయనపై 11కేసులు ఉన్నాయన్నారు. కేసులు మాఫీ చేయించుకునేందుకే భాజపాతో పొత్తుకు తహతహలాడుతున్నారని ఆరోపించారు. ప్రజలు ఆయన కుతంత్రాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. భాజపా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పి బడ్జెట్‌లో అన్యాయం చేసిందన్నారు. చంద్రబాబు మిత్రపక్షంగా ఉన్న భాజపాతో రాష్ట్రాభివృద్ధికి నిధుల కోసం ప్రయత్నిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. బీసీలతోపాటు అన్ని వర్గాల ప్రజలు తెదేపా అధినేత చంద్రబాబుకు అండగా నిలవాలన్నారు.

కష్టపడితే విజయం తథ్యం 
పీజీ నీట్‌లో జాతీయస్థాయి 9వ ర్యాంకర్‌ విరించి 

కంభం, న్యూస్‌టుడే: చిన్నతనం నుంచి తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువే లక్ష్యంగా శ్రమించి విజయ తీరాల దిశగా పయనిస్తున్నాడా కుర్రాడు. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే పుట్టపర్తిలో విద్యాభ్యాసం చేసి... కార్డియో సర్జన్‌ కావాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నాడు బండారు వెంకట శివ సాయి విరించి యాదవ్‌. బాల్యం నుంచీ విద్యార్జనలో రాణిస్తూ... ప్రస్తుతం చండీగఢ్‌లో వైద్యవిద్యలో పీజీ చేస్తున్న విరించి తాజాగా ప్రకటించిన పీజీ నీట్‌లో జాతీయస్థాయిలో తొమ్మిదో ర్యాంకు సాధించాడు. గిద్దలూరుకు చెందిన డాక్టర్‌ బండారు రంగారావు, డాక్టర్‌ సావిత్రిల ఏకైక కుమారుడు. తల్లిదండ్రులు వైద్యవృత్తిలో ఉండటంతో తాను కూడా వైద్యుడు కావాలన్న లక్ష్యంతో అడుగులు వేశాడు. పుట్టపర్తిలోని సత్యసాయిబాబా పాఠశాలలో ఒకటి నుంచి పది వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌లో చదివాడు. పదో తరగతిలో అతడు పదికి పది పాయింట్లు సాధించాడు. ఆ సమయంలో నిత్యం అయిదు గంటలు కష్టపడేవాడు. తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా అక్కడి ఉపాధ్యాయుల ఆదరణతో బెంగ లేకుండా చదవగలిగానని చెప్పాడు విరించి. పాఠశాల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సమయంలో సత్యసాయిబాబా నుంచి ప్రశంసాపత్రం అందుకున్న సంఘటన మర్చిపోలేనిదంటాడు.

©2019 APWebNews.com. All Rights Reserved.