రామాయపట్నంపై ముఖ్యమంత్రి లేఖను బహిరంగపరచాలి

రామాయపట్నంపై ముఖ్యమంత్రి లేఖను బహిరంగపరచాలి 
జిల్లా అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర 
నేడు సమావేశం.. దీక్షలు చేపట్టాలని నిర్ణయం 

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: రామాయపట్నం ఓడరేవుకు అనుకూలంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రానికి రాసిన లేఖను బహిర్గతం చేయాలని జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు చుండూరి రంగారావు కోరారు. శనివారం వేదిక ఆధ్వర్యంలో రామాయపట్నం ఓడరేవు సాధన కోసం నగరంలో పాదయాత్ర నిర్వహించారు. స్థానిక కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్‌ వంతెన వద్ద  ప్రారంభమైన పాదయాత్ర ప్రకాశం భవన్‌ వరకూ సాగింది. తెలుగుదేశం మినహా అన్ని పార్టీల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫ్లకార్డులు పట్టుకుని రామాయపట్నం ఓడరేవుకు అనుకూలంగా నినాదాలు చేశారు. దుగరాజపట్నం మీద చంద్రబాబుకు, ప్రధాన ప్రతిపక్షానికి ప్రేమ ఎందుకు? ప్రభుత్వ రంగంలోనే రామాయపట్నం ఓడరేవు నిర్మించాలని, ఓడరేవుతోనే నిరుద్యోగులు, బడుగు, బలహీనవర్గాలకు మేలు అనే నినాదాలు రాసిన ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడారు. ఇటీవల తెదేపా ఎంపీలు మాట్లాడుతూ రామాయపట్నం పోర్టుకు అనుకూలంగా ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖరాశారని చెప్పారని, ఆ లేఖను ప్రజలకు తెలిసేలా బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. సహజ అనుకూలతలు ఉన్న రామాయపట్నంను అధికారికంగా ప్రకటించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో మారీటైమ్‌ అజెండాలో రామాయపట్నంలో ఓడరేవు, నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేయవచ్చని ప్రతిపాదించారని,  రూ. 25వేల కోట్లు మూడు దశల్లో ఖర్చు పెట్టాలని ప్రాథమిక అంచనా వేశారన్నారు. ఆ తర్వాత ఆ ప్రతిపాదన మరుగునపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వేదిక కార్యదర్శి కొమ్మూరి కనకారావు, చంచుశేషయ్య మాట్లాడుతూ రామాయపట్నంలోనే భారీ ఓడరేవును ప్రభుత్వ రంగంలోనే నిర్మించాలని కోరారు. 14 చిన్న ఓడరేవుల్లో దీన్ని ఒకటిగా చూడటం ఎంత మాత్రం సహేతుకం కాదన్నారు. యూపీఏ హయాంలో పశ్చిమ బంగలో ప్రారంభించిన సాగర్‌ ఐలాండ్‌ పోర్టు పనులు సగానికి పైగా పూర్తయ్యాయని, అదే సమయంలో ప్రతిపాదదించిన రామాయపట్నానికి మాత్రం అతీగతీ లేదన్నారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.