పకడ్బందీగా ఏపీ టెట్‌ను నిర్వహించాలి 
21 నుంచి మార్చి 3 వరకు పరీక్షలు 
జిల్లా కలెక్టరు రేవు ముత్యాలరాజు 

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: ఈనెల 21 నుంచి మార్చి మూడో తేదీ వరకు టీచరు అర్హత పరీక్ష (ఏపీ టెట్‌-2018)ను అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని, ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, పకడ్బందీగా పరీక్షను నిర్వహించాలని జిల్లా పాలనాధికారి రేవు ముత్యాలరాజు ఆదేశించారు. శనివారం కలెక్టరు ఛాంబరులో ఏపీ టెట్‌ కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఏపీ టెట్‌ ఆన్‌లైన్లో కంప్యూటర్‌ ద్వారా నిర్వహిస్తున్నామని, ఈ పరీక్షకు జిల్లాలో మొత్తం ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కావలిలోని విట్స్‌, నార్త్‌రాజుపాళెంలోని శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాల, నెల్లూరు నారాయణ ఇంజినీరింగ్‌ కళాశాల, కొడవలూరులోని ఐమాన్‌ డిజిటల్‌ జోన్‌ కళాశాల, విద్యానగర్‌లోని ఎన్‌బీకేఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, గూడూరులోని ఆదిశంకర ఇంజినీరింగ్‌ కళాశాల (రెండు సెంటర్లు), బోగోలు మండలం కడనూతలలోని రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలల్లో టెట్‌ను నిర్వహిస్తున్నట్లు కలెక్టరు వివరించారు. 11 రోజులపాటు జరిగే ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మద్యాహ్నాం 12.00 గంటల వరకు, మధ్యాహ్నాం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. దివ్యాంగులకు పరీక్షలు రాసేందుకు సహాయకులను ఏర్పాటు చేయాలని, సహాయకులకు అర్హత ఇంటర్మీడియట్‌ మాత్రమే ఉండాలని సూచించారు. పరీక్షలు రాసే కేంద్రాల్లో చూచిరాత (మాల్‌ప్రాక్టీస్‌) జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. వైద్యఆరోగ్యశాఖాధికారులు తమ సిబ్బందిని ఏర్పాటుచేసి ప్రథమ చికిత్స పెట్టెలు, ఓఆర్‌ఎస్‌, ఇతర వైద్య పరికరాలు సిద్ధం చేయాలన్నారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ఫిర్యాదులొచ్చినా ఉపేక్షించేందిలేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఈవో శామ్యూల్‌, ఏపీఎస్‌పీడీసీఎల్‌ ఈస్‌ఈ విజయ్‌కుమార్‌, జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టరు వరసుందరం, పోలీసుశాఖ తరఫున అంకయ్య, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు పాల్గొన్నారు.

చెలరేగిన యువ బౌలర్లు 

వెంకటగిరి, న్యూస్‌టుడే : వెంకటగిరి పట్టణంలోని నందమూరి తారక రామారావు క్రీడా మైదానంలో శనివారం జరిగిన క్రికెట్‌ పోరులో యువ బౌలర్లు చెలరేగారు. కనుమూరు సత్యనారాయణ మెమోరియల్‌ క్రికెట్‌ కప్‌ ఆధ్వర్యంలో అండర్‌-17 క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. గ్రౌండ్‌ ‘ఎ’ లో కేఎస్సాఆర్‌సీసీ, ఎఫ్‌ఎస్‌సీఏ జట్టు తలపడ్డాయి. టాస్‌ గెలిచిన ఎఫ్‌ఎస్‌సీఏ జట్టు బ్యాటింగ్‌ చేపట్టి 39.1 ఓవర్లకు 116 పరుగులు చేసి ఆలౌటయ్యింది. ఈ జట్టులో రాజేష్‌ 23, నవీన్‌ 20 పరుగులు చేశారు. కేఎస్‌ఆర్‌సీసీ జట్టు తరపున బౌలింగ్‌ చేసిన లోకేష్‌ 4, నిఖిల్‌ 3, కల్యాణ్‌ 2 వికెట్లు పడగొట్టారు. తరువాత బ్యాటింగ్‌ చేపట్టిన కేఎస్‌ఆర్‌సీసీ జట్టు 34.5 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేశారు. ఎఫ్‌ఎస్‌సీఏ జట్టు తరపున బౌలింగ్‌ చేసిన భరత్‌ 3 వికెట్లు పడగొట్టారు. కేఎస్‌ఆర్‌సీసీ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గ్రౌండ్‌ ‘బి’లో ఎన్‌ఎస్‌యూసీసీ, సీవైసీసీ జట్టు తలపడ్డాయి. తొలుత టాస్‌ గెలిచిన ఎన్‌ఎస్‌యూసీసీ జట్టు 34.4 ఓవర్లకుగాను 184 పరుగులు చేసింది. ఈ జట్టులో చందు 69, కీర్తన్‌ 23 పరుగులు చేశారు. సీవైసీసీ జట్టు తరపున బౌలింగ్‌ చేసిన ఆసిఫ్‌, మయాంక్‌ చెరి రెండేసి వికెట్లు పడగొట్టారు. తరువాత సీవైసీసీ జట్టు బ్యాటింగ్‌ చేపట్టి 35.2 ఓవర్లకుగాను 115 పరుగులు చేసి ఆలౌటయ్యింది. ఈ జట్టులో మయాంక్‌ 22, భరత్‌ 20 పరుగులు చేశారు. ఎన్‌ఎస్‌యూసీసీ జట్టు తరపున బౌలింగ్‌ చేసిన రాహుల్‌ సాయి 3, వేణు 2 వికెట్లు పడగొట్టారు. ఎన్‌ఎస్‌యూసీసీ జట్టు 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంపైర్లుగా ఢిల్లీ శ్రీనివాసులు, యామిని వ్యవహరించారు.

సైన్స్‌తో ముడిపడిన మానవజీవితం 
రాష్ట్ర బడ్జెట్‌లో విద్యాభివృద్ధికి రూ.20వేల కోట్లు 
వైజ్ఞానిక ప్రదర్శన ముంగింపు సభలో మంత్రి సోమిరెడ్డి 

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: విద్యార్థులు చిన్ననాటి నుంచి సైన్స్‌పట్ల మక్కువ పెంపొందించుకొని ప్రపంచం మెచ్చే శాస్త్రవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. నగరం సంతపేటలోని సెయింట్‌ జోసెఫ్‌ బాలికల పాఠశాలలో మూడు రోజుల నుంచి జరిగిన జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2017-18 ఇన్‌స్పైర్‌ మనక్‌ ముగింపోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ మనిషి జీవితం సైన్స్‌తో ముడిపడి ఉంటుందని పేర్కొన్నారు.ప్రపంచంలో ఏమి జరిగినా ఎక్కడనుంచైనా తెలుసుకోవచ్చని, ఇది కేవలం సైన్స్‌ వల్లేనని తెలిపారు.సైన్స్‌ పరిజ్ఞానంతో పంటల్లో అధికదిగుబడులు సాధించేందిశలో భాగంగా రైతులకు ఎన్నో ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల చదువులకోసం గత ఏడాది బడ్జెట్‌లోరూ.17వేల కోట్లు కేటాయించిందన్నారు. ఈ ఏడాది రూ.20 వేల కోట్లకు పెంచిందన్నారు.నగర మేయర్‌ అబ్ధుల్‌ అజీజ్‌ మాట్లాడుతూ చిన్నారులు ఇప్పటి నుంచే సైన్స్‌లో రాణించి దేశానికి, ప్రపంచానికి ఉపయోగ పడేలా ప్రయోగాలు రూపొందించాలన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శనల్లో పాల్గొనాలని అప్పడే అపారమైన జ్ఞానం సమకూరుతుందన్నారు.అనంతరం జిల్లా స్థాయిలో ఉత్తమ నమూనాలుగా నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులకు ప్రసంసా పత్రిం, మెమోంటోలను అందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్‌-2 వెంకట సుబ్బారెడ్డి, విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ వీరయ్య, జిల్లా విద్యాశాఖాధికారి కె.శామ్యూల్‌, సైన్స్‌ అధికారిణి రాధారాణి, కార్పొరేటర్లు ధర్మవరపు సుబ్బారావు, ప్రశాంతి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Page 15 of 15

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.