ఎపి వెబ్ న్యూస్.కామ్

రెవెన్యూ డివిజన్‌ కేంద్రమైన కావలి మండలంలోని రుద్రకోటలో శ్రీశ్రీబాలజీరైస్‌ మిల్లులో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ అభివృద్ధికి కృషి 
రూ.40.80 లక్షల చెక్కులు అందించిన మంత్రి సోమిరెడ్డి 

నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌టుడే: జిల్లా గ్రంథాలయ సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఆ సంస్థ ఛైర్మన్‌గా కిలారి వెంకటస్వామినాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిల్లాలో గ్రంథాలయ అభివృద్ధి వేగంగా జరుగుతోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో గ్రంథాలయ సంస్థ అభివృద్ధికి మంజూరు చేసిన చెక్కులను కిలారి వెంకటస్వామినాయుడు ఆధ్వర్యంలో ఏపీడబ్ల్యూఐడీ ఈఈకి మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ రూ.40.80 లక్షలతో జిల్లాలోని పలు శాఖల కార్యాలయాలకు మరమ్మతులు, నూతన భవనాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. శిథిలావస్థలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం నూతన నిర్మాణానికి త్వరలోనే రూ.3 కోట్లు విడుదలయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కిలారి మాట్లాడుతూ ఈ నిధులతో నాలుగు శాఖా గ్రంథాలయాలు అన్నారెడ్డిపాళెం, కోట, రంగనాయకులపేట, బ్రాహ్మణక్రాకలకు మరమ్మతులకు రూ.10.30 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. కోవూరు, కుళ్లూరు శాఖ గ్రంథాలయాల నూతన భవనాలకు రూ.30.50 లక్షలు కేటాయించామన్నారు. గ్రంథాలయాల్లోని సమస్యలను జిల్లా మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పొంగూరు నారాయణ, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రల సహకారంతో అధిగమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేడీ ఈఈ విజయ్‌కుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి హెచ్‌ శేఖర్‌బాబు, డైరెక్టర్‌ జలదంకి సుధాకర్‌, సిబ్బంది పి.జితేంద్ర, శ్రీనాథ్‌రెడ్డి, విజయ్‌చంద్ర, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

అక్రమాలపై ఓ కన్నేయండి 
మోసాలు జరిగితే  ఫిర్యాదు చేయండి 
పెట్రోలు మోసాలపై  తూ.కొ. అధికారుల సూచన 

* నగరానికి చెందిన సురేష్‌కుమార్‌ వేదాయపాళెంలోని ఓ పెట్రోల్‌ బంకులో రూ.100 తన ద్విచక్ర వాహనాంలో పోసుకున్నాడు. సాధారణంగా తన బైకు రూ.100 పెట్రోలుకు 50 కి.మీ. వస్తుందని అంచనా. కానీ ఇక్కడ పెట్రోల్‌ బంకులో నింపుకున్న తర్వాత కేవలం 30 కి.మీ. దూరం వచ్చి ఆగిపోయింది. దాంతో పెట్రోల్‌లో కల్తీ అయిన జరిగి ఉండాలి. లేదా తక్కువైనా పట్టి ఉండాలి. 
* కోవూరులోని ఓ పెట్రోల్‌ బంకులో రూ.150లకు సునీల్‌ తన బైకులో పెట్రోల్‌ పోసుకున్నాడు. పెట్రోల్‌ రంగును చూసిన సునీల్‌ ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే సంబంధిత బాయ్‌ని ప్రశ్నించగా, నాణ్యమైన పెట్రోల్‌ అంటూ బదులిచ్చాడు. కల్తీని గుర్తించేందుకు ఎలాంటి పరికరాలు లేకపోవడంతో ఆయన వెనుదిరిగాడు. 
* తూనికలు, కొలతల శాఖ నిబంధనల ప్రకారం ప్రతి పెట్రోల్‌ బంకులో అయిదు లీటర్లు కొలిచే పరికరం (టెస్ట్‌ మెజర్‌), ఫిల్టరు పేపర్లు ఉండాలి. వినియోగదారుకు అనుమానం వస్తే వెంటనే అయిదు లీటర్ల డబ్బాలో పెట్రోల్‌ పోయాలి. కల్తీని నిగ్గు తేల్చేందుకు ఫిల్టరుపై పరీక్ష చేయాలి. కానీ ఇవెక్కడా అమలు కావడం లేదు.

పకడ్బందీగా ఏపీ టెట్‌ను నిర్వహించాలి 
21 నుంచి మార్చి 3 వరకు పరీక్షలు 
జిల్లా కలెక్టరు రేవు ముత్యాలరాజు 

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: ఈనెల 21 నుంచి మార్చి మూడో తేదీ వరకు టీచరు అర్హత పరీక్ష (ఏపీ టెట్‌-2018)ను అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని, ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, పకడ్బందీగా పరీక్షను నిర్వహించాలని జిల్లా పాలనాధికారి రేవు ముత్యాలరాజు ఆదేశించారు. శనివారం కలెక్టరు ఛాంబరులో ఏపీ టెట్‌ కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఏపీ టెట్‌ ఆన్‌లైన్లో కంప్యూటర్‌ ద్వారా నిర్వహిస్తున్నామని, ఈ పరీక్షకు జిల్లాలో మొత్తం ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కావలిలోని విట్స్‌, నార్త్‌రాజుపాళెంలోని శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాల, నెల్లూరు నారాయణ ఇంజినీరింగ్‌ కళాశాల, కొడవలూరులోని ఐమాన్‌ డిజిటల్‌ జోన్‌ కళాశాల, విద్యానగర్‌లోని ఎన్‌బీకేఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, గూడూరులోని ఆదిశంకర ఇంజినీరింగ్‌ కళాశాల (రెండు సెంటర్లు), బోగోలు మండలం కడనూతలలోని రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలల్లో టెట్‌ను నిర్వహిస్తున్నట్లు కలెక్టరు వివరించారు. 11 రోజులపాటు జరిగే ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మద్యాహ్నాం 12.00 గంటల వరకు, మధ్యాహ్నాం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. దివ్యాంగులకు పరీక్షలు రాసేందుకు సహాయకులను ఏర్పాటు చేయాలని, సహాయకులకు అర్హత ఇంటర్మీడియట్‌ మాత్రమే ఉండాలని సూచించారు. పరీక్షలు రాసే కేంద్రాల్లో చూచిరాత (మాల్‌ప్రాక్టీస్‌) జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. వైద్యఆరోగ్యశాఖాధికారులు తమ సిబ్బందిని ఏర్పాటుచేసి ప్రథమ చికిత్స పెట్టెలు, ఓఆర్‌ఎస్‌, ఇతర వైద్య పరికరాలు సిద్ధం చేయాలన్నారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ఫిర్యాదులొచ్చినా ఉపేక్షించేందిలేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఈవో శామ్యూల్‌, ఏపీఎస్‌పీడీసీఎల్‌ ఈస్‌ఈ విజయ్‌కుమార్‌, జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టరు వరసుందరం, పోలీసుశాఖ తరఫున అంకయ్య, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు పాల్గొన్నారు.

©2019 APWebNews.com. All Rights Reserved.