పకడ్బందీగా ఏపీ టెట్‌ను నిర్వహించాలి

పకడ్బందీగా ఏపీ టెట్‌ను నిర్వహించాలి 
21 నుంచి మార్చి 3 వరకు పరీక్షలు 
జిల్లా కలెక్టరు రేవు ముత్యాలరాజు 

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: ఈనెల 21 నుంచి మార్చి మూడో తేదీ వరకు టీచరు అర్హత పరీక్ష (ఏపీ టెట్‌-2018)ను అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని, ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, పకడ్బందీగా పరీక్షను నిర్వహించాలని జిల్లా పాలనాధికారి రేవు ముత్యాలరాజు ఆదేశించారు. శనివారం కలెక్టరు ఛాంబరులో ఏపీ టెట్‌ కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఏపీ టెట్‌ ఆన్‌లైన్లో కంప్యూటర్‌ ద్వారా నిర్వహిస్తున్నామని, ఈ పరీక్షకు జిల్లాలో మొత్తం ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కావలిలోని విట్స్‌, నార్త్‌రాజుపాళెంలోని శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాల, నెల్లూరు నారాయణ ఇంజినీరింగ్‌ కళాశాల, కొడవలూరులోని ఐమాన్‌ డిజిటల్‌ జోన్‌ కళాశాల, విద్యానగర్‌లోని ఎన్‌బీకేఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, గూడూరులోని ఆదిశంకర ఇంజినీరింగ్‌ కళాశాల (రెండు సెంటర్లు), బోగోలు మండలం కడనూతలలోని రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలల్లో టెట్‌ను నిర్వహిస్తున్నట్లు కలెక్టరు వివరించారు. 11 రోజులపాటు జరిగే ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మద్యాహ్నాం 12.00 గంటల వరకు, మధ్యాహ్నాం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. దివ్యాంగులకు పరీక్షలు రాసేందుకు సహాయకులను ఏర్పాటు చేయాలని, సహాయకులకు అర్హత ఇంటర్మీడియట్‌ మాత్రమే ఉండాలని సూచించారు. పరీక్షలు రాసే కేంద్రాల్లో చూచిరాత (మాల్‌ప్రాక్టీస్‌) జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. వైద్యఆరోగ్యశాఖాధికారులు తమ సిబ్బందిని ఏర్పాటుచేసి ప్రథమ చికిత్స పెట్టెలు, ఓఆర్‌ఎస్‌, ఇతర వైద్య పరికరాలు సిద్ధం చేయాలన్నారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ఫిర్యాదులొచ్చినా ఉపేక్షించేందిలేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఈవో శామ్యూల్‌, ఏపీఎస్‌పీడీసీఎల్‌ ఈస్‌ఈ విజయ్‌కుమార్‌, జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టరు వరసుందరం, పోలీసుశాఖ తరఫున అంకయ్య, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.