చెలరేగిన యువ బౌలర్లు

చెలరేగిన యువ బౌలర్లు 

వెంకటగిరి, న్యూస్‌టుడే : వెంకటగిరి పట్టణంలోని నందమూరి తారక రామారావు క్రీడా మైదానంలో శనివారం జరిగిన క్రికెట్‌ పోరులో యువ బౌలర్లు చెలరేగారు. కనుమూరు సత్యనారాయణ మెమోరియల్‌ క్రికెట్‌ కప్‌ ఆధ్వర్యంలో అండర్‌-17 క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. గ్రౌండ్‌ ‘ఎ’ లో కేఎస్సాఆర్‌సీసీ, ఎఫ్‌ఎస్‌సీఏ జట్టు తలపడ్డాయి. టాస్‌ గెలిచిన ఎఫ్‌ఎస్‌సీఏ జట్టు బ్యాటింగ్‌ చేపట్టి 39.1 ఓవర్లకు 116 పరుగులు చేసి ఆలౌటయ్యింది. ఈ జట్టులో రాజేష్‌ 23, నవీన్‌ 20 పరుగులు చేశారు. కేఎస్‌ఆర్‌సీసీ జట్టు తరపున బౌలింగ్‌ చేసిన లోకేష్‌ 4, నిఖిల్‌ 3, కల్యాణ్‌ 2 వికెట్లు పడగొట్టారు. తరువాత బ్యాటింగ్‌ చేపట్టిన కేఎస్‌ఆర్‌సీసీ జట్టు 34.5 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేశారు. ఎఫ్‌ఎస్‌సీఏ జట్టు తరపున బౌలింగ్‌ చేసిన భరత్‌ 3 వికెట్లు పడగొట్టారు. కేఎస్‌ఆర్‌సీసీ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గ్రౌండ్‌ ‘బి’లో ఎన్‌ఎస్‌యూసీసీ, సీవైసీసీ జట్టు తలపడ్డాయి. తొలుత టాస్‌ గెలిచిన ఎన్‌ఎస్‌యూసీసీ జట్టు 34.4 ఓవర్లకుగాను 184 పరుగులు చేసింది. ఈ జట్టులో చందు 69, కీర్తన్‌ 23 పరుగులు చేశారు. సీవైసీసీ జట్టు తరపున బౌలింగ్‌ చేసిన ఆసిఫ్‌, మయాంక్‌ చెరి రెండేసి వికెట్లు పడగొట్టారు. తరువాత సీవైసీసీ జట్టు బ్యాటింగ్‌ చేపట్టి 35.2 ఓవర్లకుగాను 115 పరుగులు చేసి ఆలౌటయ్యింది. ఈ జట్టులో మయాంక్‌ 22, భరత్‌ 20 పరుగులు చేశారు. ఎన్‌ఎస్‌యూసీసీ జట్టు తరపున బౌలింగ్‌ చేసిన రాహుల్‌ సాయి 3, వేణు 2 వికెట్లు పడగొట్టారు. ఎన్‌ఎస్‌యూసీసీ జట్టు 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంపైర్లుగా ఢిల్లీ శ్రీనివాసులు, యామిని వ్యవహరించారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.