పరీక్షల ముందు.. ఫలించిన ప్రయత్నాలు 
వర్సిటీ పూచీకత్తుతో హాజరుకానున్న 18 కళాశాలల విద్యార్థులు 
ఈనెల 19 నుంచి బీఈడీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు 
న్యూస్‌టుడే, కర్నూలు విద్య 

విశ్వవిద్యాలయంలో సీడీసీ విభాగం కీలకం. ఇది విద్యార్థుల ప్రవేశాలు, వసతులు, బోధన సిబ్బంది, తనిఖీలు వంటి అంశాలను పరిశీలిస్తుంది. ప్రైవేటు కళాశాలలు దీని ఆధీనంలోనే ఉంటాయి. ఈ ఏడాది 63 ప్రైవేటు బీఈడీ కళాశాలలు సీడీసీ గుర్తింపు లభించింది. ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) మార్గదర్శకాల మేరకు 50 కళాశాలల్లో ప్రవేశాలు జరిగాయి. ఆ మేరకు మొత్తం 2,270 మంది విద్యార్థుల సమాచారం ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. మొదటి సెమిస్టర్‌ పరీక్షలకు యాప్సీ 32 కళాశాలలకుగాను 1,323 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. మిగిలిన 18 కళాశాలలకు సంబంధించి వర్సిటీ ‘అండర్‌ టేకింగ్‌’ (ష్యూరిటీ) ద్వారా 947 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకు ఆయా కళాశాలల యాజమాన్యాలు వర్సిటీ అధికారులపై పలు రకాలుగా ఒత్తిడి తేవడంతో పది రోజుల్లో యాప్సీ ద్వారా అనుమతులు తెచ్చుకోవాలని, లేకపోతే పరీక్ష ఫలితాలు నిలుపుదల చేయవచ్చని హామీపత్రాన్ని వర్సిటీ తీసుకుని పరీక్షలకు ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది.

19న నంద్యాలలో మీకోసం ప్రజాదర్బార్‌

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: మీకోసం ప్రజాదర్బార్‌ కార్యక్రమం వచ్చే సోమవారం నంద్యాల రెవెన్యూ డివిజన్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ ప్రకటనలో తెలిపారు. నంద్యాల ఆర్డీవో కార్యాలయంలో హాజరై ప్రజలు తమ వినతులను నేరుగా అధికారులకు సమర్పించుకోవాలని ఆయన సూచించారు.

చౌకదుకాణ డీలర్ల పరీక్షలు రద్దు

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే : ఆదోని డివిజన్‌ పరిధిలోని చౌకదుకాణాల డీలర్ల స్థానాలకు సంబంధించిన నియామకపు పరీక్ష ఈ నెల 11వ తేదీన స్థానిక మిల్టన్‌ పాఠశాలలో నిర్వహించారు. పరీక్షకు ముందే ప్రశ్నపత్రం లీకేజీ అయింది. దీనిపై ‘ఈనాడు’లో ‘డీలరు పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ.. ఆందోళనలో అభ్యర్థులు’ అనే శీర్షికతో కథనం రావడంతో అధికారులు విచారణ చేశారు. శనివారం కలెక్టరు సత్యనారాయణ ఆదోని డివిజన్‌ డీలరు పోస్టులు పరీక్షలు రద్దు చేస్తూ.. ఆదేశాలు జారీ చేశారని ఆదోని ఆర్డీఓ ఓబులేశు తెలిపారు. తదుపరి పరీక్షల తేదీని నిర్ణయించి ప్రకటిస్తామన్నారు. ఆదోని డివిజన్‌ వ్యాప్తంగా మొత్తం 82 పోస్టులకు గాను పలు ప్రాంతాల నుంచి మొత్తం 371 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. కష్టపడి పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో పరీక్షల రద్దుతో ఆందోళనకు గురవుతున్నారు. ఎవరో చేసిన తప్పునకు మేము బాధ్యులు కావాల్సి వచ్చిందని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. లీకేజీకి కారకులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

ముగిసిన పార్వేట ఉత్సవాలు 

ఆళ్లగడ్డ గ్రామీణ, న్యూస్‌టుడే: లక్ష్మీనృసింహ స్వామి పార్వేట ఉత్సవాలు ముగియడంతో శనివారం స్వామి పల్లకి అహోబిలానికి చేరుకొంది. ఆలయ ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్‌, ట్రాన్స్‌కో ఏఈ రవికాంత్‌ చౌదరి, గ్రామస్థులు స్వామికి ప్రత్యేక పూజలు చేసి గ్రామంలోకి ఆహ్వానించారు. అనంతరం పల్లకిని మోస్తూ స్వామి వారిని ఆలయానికి తీసుకెళ్లారు. ఆలయ ముఖద్వారం వద్ద ప్రహ్లాదవరద, జ్వాలా నృసింహ స్వామి వారిని కొలువుంచి పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఆ తర్వాత వేదమంత్రోచ్ఛరణలతో హోమం నిర్వహించారు. తదనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనమందించారు. అర్చకులు రాఘవ, మధు, మణియార్‌ సౌమ్యనారాయణ్‌ పూజలు చేశారు.

108 కేసులకు ప్రత్యేక ఓపీ 

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా 108 వాహనాల్లో తీసుకొచ్చిన రోగులకు సర్వజన వైద్యశాలలోని అత్యవసర విభాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓపీ కౌంటర్‌ను డీఎంహెచ్‌వో జేవీవీ ఆర్‌కే ప్రసాద్‌, ఆసుపత్రి పర్యవేక్షకులు డా.చంద్రశేఖర్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 108 వాహనాల్లో అత్యవసర కేసులను తరలిస్తుంటారని, వీరు పెద్దాసుపత్రికి వచ్చాక ఓపీ తెచ్చుకోవడలో ఆలస్యం జరుగుతుండటంతో అత్యవసర వైద్యం అందించడంలో ఆలస్యం జరుగుతోందని, రోగులు వారి సహాయకులు ఓపీ తెచ్చుకోలేని పరిస్థితి ఉంటోందన్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అత్యసర విభాగంలోనే ఓపీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

లండన్‌: ఇసుక తవ్వకాలు అతిగా చేపట్టడంతో పర్యావరణానికి చేటుజరుగుతోంది. దీంతో భారత్‌ వ్యాప్తంగా తవ్వకాలపై ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఫలితంగా నిర్మాణ రంగాన్ని ఇసుక కొరత వేధిస్తోంది. మరోవైపు 40 శాతం వరకూ ప్లాస్టిక్‌ వ్యర్థాలను నేలలో పూడ్చిపెడుతున్నారు. ఇవి మట్టిలో కలిసేందుకు చాలా ఏళ్లు పడుతుంది. ఈ రెండు సమస్యలకు పరిష్కారం చూపే దిశగా బ్రిటన్‌లోని బాత్‌ వర్సిటీ నిపుణులు కొత్త అధ్యయనం చేపట్టారు. కాంక్రీటులో ఇసుకకు బదులుగా ప్లాస్టిక్‌ను వినియోగించడంపై వారు దృష్టిసారించారు.  భిన్న మొత్తాల్లో పునర్వినియోగ ప్లాస్టిక్‌ను కలుపుతూ వారు 11 కాంక్రీటు మిశ్రమాలను తయారుచేశారు. వీటిపై చేపట్టిన విశ్లేషణలో.. దాదాపు 10 శాతం వరకూ ఇసుకను ప్లాస్టిక్‌తో భర్తీ చేసుకోవచ్చని వెలుగులోకి వచ్చింది. ఫలితంగా ఏటా 82 కోట్ల టన్నుల ఇసుకను ఆదా చేయొచ్చని బయటపడింది.

Page 2 of 2

తాజా వార్తలు

©2018 APWebNews.com. All Rights Reserved.