అమరావతికి దీటుగా కర్నూలు అభివృద్ధి రూ.876 కోట్ల కేటాయింపు

అమరావతికి దీటుగా కర్నూలు అభివృద్ధి 
రూ.876 కోట్ల కేటాయింపు 
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం 
కర్నూలు పాతనగరం, న్యూస్‌టుడే 

కర్నూలును అమరావతికి దీటుగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ పద్దుల కింద రూ.876 కోట్లు మంజూరు చేశారని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రం అర్థిక లోటులో ఉన్నా జిల్లా ప్రజల సమస్యలు తీర్చడానికి ఈ నిధులు మంజూరు చేశారని, నగరంలో రెండువేల పింఛన్లు ఇవ్వగా ఇంకా అవసరమంటే 2,202 మంజూరు చేసినట్లు చెప్పారు. మైనార్టీ సంక్షేమ పథకాల కింద మసీదులు, చర్చీల అభివృద్ధికి, వివాహాలకు అర్థికసహాయం తదితర పథకాలకు రూ.11.19 కోట్లు, నగరంలో 51 వార్డుల్లో రహదారుల నిర్మాణానికి రూ.33.60 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.8.58 కోట్లు, ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.75 లక్షలు, బీసీ కార్పొరేషన్‌కు రూ.15.40 కోట్లు, బీసీ ఫెడరేషన్‌కు రూ.10.20 కోట్లు, కాపు కార్పొరేషన్‌కు రూ. 72 లక్షలు, మైనార్టీ కార్పొరేషన్‌కు రూ.42.55 కోట్లు, క్రైస్తవ మైనార్టీకి రూ.42 లక్షలు మంజూరు చేసి అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారన్నారు. మహిళా సంఘాల బలోపేతానికి రూ.63.17 కోట్లు మంజూరు చేయాలని అ శాఖల అధికారులకు అదేశాలు ఇచ్చారన్నారు. నగరవాసులకు వేసవిలో నీటి ఎద్దడి లేకుండా శాశ్వత పరిష్కారానికి రూ.200 కోట్లు మంజూరు చేశారని, త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. ముఖ్యంగా పాణ్యం నియోజకవర్గంలోని 15 వార్డులకు తాగునీటి సమస్య ఎక్కువగా ఉండేదని, మొదట అక్కడే పనులు ప్రారంభిస్తామన్నారు. స్వచ్ఛాంధ్ర నిధులు రూ.45 కోట్లు, ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులు రూ.50 కోట్లు ఇప్పటికే కేటాయించగా ఆ పనులు పురోగతిలో ఉన్నాయని, ప్రస్తుతం స్వచ్ఛాంధ్ర నిధులు రూ.14 కోట్లు, ఉపప్రణాళిక నిధులు మరో రూ.90 కోట్లు మాంజూరు చేయగా దళితవాడల అభివృద్ధికే ఖర్చు చేస్తామన్నారు. కోడుమూరు, పాణ్యం, నగరంలోని 51 వార్డుల్లో సీసీ రహదారుల నిర్మాణానికి రూ.323.65 కోట్లు మంజూరు చేశారన్నారు. అభివృద్ధికి నిధులు కేటాయించిన ముఖ్యమంత్రికి కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ కృతజ్ఞతలు తెలిపారు. సోమిశెట్టి మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌ విషయంలో వైకాపా నేతల తీరును ఎండగట్టారు. రాజీనామాలు చేస్తామనటం ఆ పార్టీ అధినేత జగన్‌కు ఊతపదంగా మారిందని విమర్శించారు. నగరపాలక సంస్థ ఎన్నికలు వస్తున్నందున హడావిడిగా నిధులు మంజూరు చేస్తున్నారనే ప్రశ్నకు పాణ్యం బాధ్యులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి సమాధానం ఇస్తూ ఎన్నికలు ఎప్పుడు వస్తాయే తెలియదని, అవి కోర్టు పరిధిలో ఉన్నాయని, జిల్లా వాసులకు ఇచ్చిన హామీలనే ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారన్నారు. ఎన్నికలు బయపడమని కచ్చితంగా విజయం సాధిస్తామన్నారు. 

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.