ముఖ్యమంత్రి స్పందించే వరకు పోరాడదాం రాయలసీమ న్యాయవాదుల ఐకాస

ముఖ్యమంత్రి స్పందించే వరకు పోరాడదాం 
రాయలసీమ న్యాయవాదుల ఐకాస 

కర్నూలు న్యాయవిభాగం, న్యూస్‌టుడే: రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసే విషయంలో ముఖ్యమంత్రి స్పందించే వరకు పోరాడుదామని రాయలసీమ న్యాయవాదుల ఐకాస ప్రకటించింది. శనివారం స్థానిక యునైటెడ్‌ క్లబ్‌లో ఐకాస కో-కన్వీనర్‌ నాగలక్ష్మీ ఆధ్వర్యంలో నాలుగు జిల్లాల న్యాయవాదుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐకాస కన్వీనర్‌, కడప జిల్లాకు చెందిన మస్తాన్‌ వలీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ ఇతర ప్రాంతాలకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర హైకోర్టును సీమలో ఏర్పాటు చేయాలని డిమాండు చేశారు. వెనుకబడిన ప్రాంతమైన సీమను నిర్లక్ష్యం చేస్తే ముఖ్యమంత్రి తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందన్నారు. వి.నాగలక్ష్మీదేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సీమబిడ్డ అయినప్పటికీ సొంత ప్రాంతానికి ద్రోహం చేస్తున్నారని, వెంటనే సీమలో హైకోర్టు ఏర్పాటుపై ప్రకటన చేయాలని డిమాండు చేశారు. గత 27 రోజులుగా న్యాయవాదులు ఉద్యమిస్తున్నా స్పందించకపోవటం విచారకరమన్నారు. త్వరలో ప్రజాప్రతినిధుల నుంచి తీసుకున్న మద్దతు లేఖలను ముఖ్యమంత్రికి సమర్పిస్తామని చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో కలిసి ఉద్యమం తీవ్రతరం చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు, కర్నూలుకు చెందిన రవిగువేరా, అనంతపురంకు చెందిన రామిరెడ్డిలు మాట్లాడుతూ దేశంలోని పలు రాష్ట్రాల్లో హైకోర్టులు రాజధానిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు తెలిపారు. ఐకాస సలహాదారులు వై.జయరాజ్‌, ఎస్‌.చాంద్‌బాషా మాట్లాడుతూ ఉద్యమం ప్రజల్లోకి వెళ్లిందని, ప్రభుత్వం దిగి వచ్చేదాకా అన్ని వర్గాలను కలుపుకొని ఉద్యమిద్దామని అన్నారు. అనంతపురం ఐకాస నాయకులు భరత్‌భూషణ్‌రెడ్డి, చిత్తూరు జిల్లాకు చెందిన రవికాంత్‌రెడ్డి, ప్రొద్దుటూరు శ్రీనివాసులు, ఆదోని జీసీ రంగన్న, కర్నూలుకు చెందిన నిర్మల, ఓంకార్‌, రంగారవికుమార్‌, నంద్యాల స్వామిరెడ్డి, అనంతపురం గురుప్రసాద్‌లతోపాటు పలువురు నాయకులు పాల్గొని ప్రసంగించారు. శనివారం స్థానిక శ్రీకృష్ణదేవరాయ విగ్రహం వద్ద 28వ రోజుకు చేరిన దీక్షలో అనిల్‌కుమార్‌, ఎ.వెంకటేశ్వర్లు, చలపతిరావు, బేగ్‌, కేశవరావులు కూర్చున్నారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.