క్రీడల అభివృద్ధికి తోడ్పడతాం

క్రీడల అభివృద్ధికి తోడ్పడతాం 
సెంట్రల్‌ జోనల్‌ బాలికల పోటీలు ప్రారంభం 

నంద్యాల క్రీడా విభాగం, న్యూస్‌టుడే: నంద్యాలలో క్రీడల అభివృద్ధికి ఎల్లవేళలా తోడ్పడతామని నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందారెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక ఎస్పీజీ మైదానంలో మహానంది మండలం గోపవరం ఉన్నత పాఠశాల, కర్నూలు జిల్లా సెకండరీ పాఠశాలల అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన సెంట్రల్‌ జోనల్‌ బాలికల పోటీలకు ముఖ్య అతిథులుగా ఆయనతోపాటు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కమిషనర్‌ నరసింహులు పాల్గొని జాతీయ, క్రీడా పతాకాలను ఆవిష్కరించారు. జిల్లా నుంచి వచ్చిన క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నంద్యాలను క్రీడా హబ్‌గా తయారు చేస్తామన్నారు. పద్మావతినగర్‌లోని ఇండోర్‌ స్టేడియంలో త్వరలో క్రమం తప్పకుండా సాధన చేసుకోవడానికి అన్ని వసతులు కల్పిస్తామన్నారు. అనంతరం సెంట్రల్‌ జోనల్‌ కార్యదర్శి మెహన్‌రెడ్డి మాట్లాడుతూ... రెండు రోజులపాటు జరిగే ఈ పోటీలలో నంద్యాల, కర్నూలు, డోన్‌, ఆదోని డివిజన్ల నుంచి సుమారు 500 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. అండర్‌-14, 17 విభాగాల్లో ఫుట్‌బాల్‌, హాకీ, హ్యాండ్‌బాల్‌, త్రోబాల్‌, బాస్కెట్‌బాల్‌, ఖోఖో, టెన్నీకాయిట్‌, వాలీబాల్‌, కబడ్డీ, సెపక్‌తక్రా, సాఫ్ట్‌బాల్‌, పరుగుపందెం 200 400 800 మీటర్లు, హైజంప్‌, లాంగ్‌జంప్‌, ట్రిఫుల్‌ జంప్‌, షాట్‌పుట్‌, జావెలిన్‌, డిస్కస్‌త్రో వంటివి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 26 ఏళ్ల నుంచి నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గంలో జరుగుతున్న క్రీడా పోటీలకు ఎంపీ ఎస్పీవై రెడ్డి ఉచిత భోజన వసతి కల్పిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా డిప్యూటీ ఈవో బ్రహ్మంనాయక్‌, జిల్లా మాజీ ఒలింపిక్‌ సంఘం ఛైర్మన్‌ డా.రవికృష్ణ, రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ ఎన్నికల సంఘం ఛైర్మన్‌ పిచ్చిరెడ్డి, జిల్లా పీఈటీ అసోసియేషన్‌ ఛైర్మన్‌ శేషిరెడ్డి, జోనల్‌ ఛైర్మన్‌ మంజుల తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.