ఎపి వెబ్ న్యూస్.కామ్ 

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. సబ్సిడీపై వివిధ పరికరాలను మత్స్యకారులకు అందించే కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక టౌన్‌హాల్‌లో నిర్వహించారు.

5లక్షల మంది రైతులకు ఈ-పాసు పుస్తకాలు

విజయవాడ: కృష్ణా జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా 5లక్షల మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల స్థానంలో ఈ- పాసు పుస్తకాలను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా జిల్లా బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ- పాసు పుస్తకాల వల్ల బోగస్‌ ఖాతాలను అరికట్టవచ్చని వారు చెప్పారు. మెరుగైన భద్రతా ప్రమాణాలు పాటించినందున ఫోర్జరీకి అవకాశం ఉండదన్నారు. రబీలో ఇంకా మంజూరు చేయాల్సిన వందకోట్ల రూపాయల పంటరుణాలను పది రోజుల్లోగా అందించాలని బ్యాంకర్లను మంత్రి దేవినేని కోరారు. బ్యాంకర్ల రుణపరపతి మొత్తాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు. ముద్రా రుణాల మంజూరు సమాచారాన్ని ప్రజాప్రతినిధులకు తెలియజేయకపోవడం..బ్యాంకర్ల సమావేశాలకు డీజీఎం స్థాయి అధికారులు హాజరుకాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆదాయపు పన్ను చెల్లింపు సామాజిక బాధ్యత 

పటమట, న్యూస్‌టుడే: ఆదాయపు పన్ను చెల్లింపు సామాజిక బాధ్యత అని, సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో కొంత ఆదాయ పన్ను రూపేణా సమాజానికి ఇవ్వాలని ఆదాయపు పన్ను శాఖ విజయవాడ (రేంజ్‌-2) సంయుక్త కమిషనర్‌ శేష శ్రీనివాస్‌ యేపూరి అన్నారు. బెంజిసర్కిల్‌ సమీపంలోని కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం హాలులో లారీ యజమానులకు ఆదాయపు పన్నుపై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.   ముఖ్యఅతిథిగా హాజరైన శేష శ్రీనివాస్‌ మాట్లాడుతూ 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో కేవలం మూడు శాతం మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 65 శాతం మంది మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నారని, దాని ప్రకారం చూసుకుంటే 40 కోట్ల మంది ఆదాయపు పన్ను చెల్లించాలని, కాని నాలుగు కోట్ల మంది మాత్రమే కడుతున్నారని తెలిపారు. పన్ను బాధ పెట్టడానికి, ఇబ్బంది పెట్టేందుకు కాదని, సంపాదించిన దానికి తగ్గట్లు, కొంత సంఘానికి ఇవ్వాలని పేర్కొన్నారు. పది లారీలు లోపు ఉన్నా, పైన ఉన్న అందరూ పుస్తకాల్లో తమ ఆదాయ, వ్యయాలు రాసి పెట్టుకోవాలని, ఆదాయం ఎక్కువైనా, తక్కువైనా రిటర్న్స్‌ మాత్రం తప్పనిసరిగా ఫైల్‌ చేయాలని స్పష్టం చేశారు. ఆదాయపు పన్ను శాఖ విజయవాడ సర్కిల్‌ 2 (1) డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ ఎస్‌.కె.సెంథిల్‌ కుమార్‌ మాట్లాడుతూ అధిక ఆదాయం కలిగిన వాళ్లు మన దేశంలో ఎక్కువ మంది ఉన్నా, చాలా మంది ఆదాయపు పన్ను చెల్లించడం లేదని వెల్లడించారు.

కొల్లేటి పెద్దమ్మ సంబరం ప్రారంభం 
మార్చి 1 వరకు  శ్రీపెద్దింటి అమ్మవారి ఉత్సవాలు 

కొల్లేటికోట(కైకలూరు), న్యూస్‌టుడే: అమ్మలగన్నయమ్మ శ్రీకొల్లేటి పెద్దమ్మయని భక్తులు కొనియాడే శ్రీపెద్దింటి అమ్మవారి జాతర ఉత్సవాలను శుక్రవారం అత్యంత వైభవోపేతంగా ప్రారంభించారు. ఆలయ ఈవో ఆకుల కొండలరావు ఆధ్వర్యంలో అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ, వెంకట్రామయ్యలు ఉదయం 6 గంటల నుంచే విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచన, పంచామృత అభిషేకాలు, శ్రీచక్రార్చన, నూతన వస్త్రాలంకరణ, ధూపసేవ, బాలభోగం వంటి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, కొల్లేరు గ్రామాల పెద్దలు, నాయకులు అమ్మవారికి నూతన వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ  సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ శుక్రవారం నుంచి మార్చి ఒకటోతేదీ వరకు నిర్వహించే ఈ ఉత్సవాలకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారన్నారు. వందల ఏళ్లనాటి చరిత్ర ఉన్న అమ్మవారు చాలా మహిమగల దేవతగా పూజిస్తామన్నారు. భుజబలపట్నానికి చెందిన గొట్టుముక్కల శ్యామ్‌ప్రసాద్‌, కల్యాణి దంపతులు అమ్మవారికి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, భక్తులకు ఉచిత ప్రసాదం ఏర్పాటు చేశారు. ఉత్సవాల ప్రారంభానికి కొల్లేరు సంఘం ప్రధాన కార్యదర్శి బలే ఏసురాజు, ఎంపీపీ బండి సత్యవతి, జడ్పీటీసీ సభ్యురాలు బొమ్మనబోయిన విజయలక్ష్మి, తెదేపా నాయకులు సయ్యపురాజు గుర్రాజు, త్రినాథరాజు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఛైర్మన్‌ బలే చంటి, కొల్లేటికోట, పెంచికలమర్రు, పందిరిపల్లిగూడెం, శృంగవరప్పాడు, గోకర్ణపురం, వడ్లకూటితిప్ప గ్రామాల పెద్దలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. తహసీల్దార్‌ శ్రీనివాస్‌ నాయక్‌, సీఐ రవికుమార్‌, వివిధ శాఖల అధికారులు  పాల్గొన్నారు. సాయంత్రం శింగరాయపాలేనికి చెందిన ఆనందదాసు కృష్ణమూర్తి భగవతార్‌చే హరికథా కాలక్షేపం విశేషంగా అలరించింది.

కేంద్ర నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి 
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు గాంధీనగర్‌ (విజయవాడ) న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని కేంద్రం ఎంత నిధులు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ వ్యవశాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతోనే ప్రజలు తెదేపాని గెలిపించారని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనలో ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారన్నారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ప్రపంచస్థాయి రాజధాని కడతామని ప్రజలను మభ్యపెట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. రాజధానిలో శాశ్వత భవనాల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని విభజన చట్టంలో స్పష్టం ఉన్పప్పటికీ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తేలేదని ఆయన ప్రశ్నించారు. తాత్కాలిక నిర్మాణాల పేరుతో రూ.800కోట్లు రూపాయిల ప్రజాదనం దుర్వినియోగమైందన్నారు. భాజపా హయాంలో ఇచ్చిన మూడు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు రాజధాని నిర్మాణాలు జరగలేదని చెప్పారు. తెలంగాణతో మొన్నటి వరకు కత్తులు దూసుకున్న తెదేపా నాయకులు ఇప్పుడు ఎందుకు వారిని ఆలింగంనం చేసుకుంటున్నారో ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన నిధులు, ఎంవోయూలపై  శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

గందరగోళానికి గురి చేయటం తగదు 
భాజపా జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి 

విస్సన్నపేట, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్‌ విషయంలో రాష్ట్రంలోని భాజపాయేతర పార్టీలన్నీ ఏకమై రాష్ట్ర ప్రజలను గందరగోళ పరిస్థితులకు గురి చేయటం తగదని భాజపా జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి అన్నారు. మండల పార్టీ నాయకుడు మాచిన అరవింద్‌ తండ్రి రాజేంద్రప్రసాద్‌ ఇటీవల మృతిచెందగా, అరవింద్‌ను పరామర్శించేందుకు వచ్చిన ఆయన అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌ ఏ రాష్ట్రానికి సంబంధించినది కాకపోవటమే కాక, ఏ ఒక్క రాష్ట్రానికో ప్రత్యేక ప్రయోజనాలు కలిగేలా రూపకల్పన చేయరన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితిని గుర్తించి, బడ్జెట్‌తో సంబంధం లేకుండానే కొన్ని సంవత్సరాలుగా కేంద్రం రాష్ట్రానికి పెద్దమొత్తంలో నిధులు కేటాయించిందన్నారు. కేంద్రమంత్రిగా వెంకయ్యనాయుడు రాష్ట్రానికి రూ.2వేల కోట్ల ప్రయోజనాలు చేకూర్చటమేకాక, గృహ నిర్మాణ శాఖ ద్వారా ఆరు లక్షల ఇళ్లు కేటాయించినట్లు వివరించారు. దేశవ్యాప్తంగా రోజంతా విద్యుత్‌ సరఫరాకు మూడు రాష్ట్రాలను ఎంపిక చేయాల్సి ఉండగా, వాటిలో ఆంధ్రప్రదేశ్‌ను ఒకటిగా గుర్తించి, ప్రయోజనం చేకూర్చిందన్నారు. రాష్ట్రంలోని రహదారుల అభివృద్ధికి బడ్జెట్‌తో సంబంధం లేకుండా రూ.లక్ష కోట్లు కేటాయించినట్లు చెప్పారు. త్వరలో ఎన్నికలు సమీపిస్తున్నందున ఇప్పటి బడ్జెట్‌ను ఒక అంశంగా రాష్ట్రంలో బలోపేతమవుతున్న భాజపాకు వ్యతిరేకంగా మార్చేందుకు అన్ని రాజకీయపార్టీలు కుమ్మక్కై ఆందోళనలు చేస్తున్నాయన్నారు. రాష్ట్ర చరిత్రలో విపక్షాలన్నీ కలసి బంద్‌కు పిలుపునిస్తే, రాష్ట్ర ప్రభుత్వం మద్దతుగా పాఠశాలలకు సెలవు ప్రకటించి, ఆర్టీసీ బస్సులు నిలిపి, ప్రదర్శనలు చేస్తూ మద్దతు పలకటం మిత్రధర్మాన్ని వ్యతిరేకించటమేనన్నారు. బడ్జెట్‌ను అంగీకరిస్తూ కేంద్ర క్యాబినెట్‌లో ఆమోదం తెలుపుతూ తెదేపా మంత్రులే సంతకాలు చేశారని, వైకాపా ఎంపీలు బడ్జెట్‌ బాగుందని కితాబునిచ్చారన్నారు. సమావేశంలో జిల్లా మహిళామోర్చా అధ్యక్షురాలు పోలే శాంతి, జిల్లా కార్యదర్శి మీసాల సత్యనారాయణ, జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్‌ బాజీబాబా, సీనియర్‌ నాయకులు డా.జి.వీరభద్రరావు, తిరువూరు నియోజకవర్గ కన్వీనర్‌ దారా మాధవరావు, నాయకులు ఆడుమిల్లి మల్లయ్యస్వామి, సుందర్రావు, తుమ్మలపల్లి రమేష్‌, పి.రామచంద్రరావు తదితరులు ఉన్నారు.

Page 3 of 3

తాజా వార్తలు

©2018 APWebNews.com. All Rights Reserved.