కేంద్ర నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి 
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు గాంధీనగర్‌ (విజయవాడ) న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని కేంద్రం ఎంత నిధులు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ వ్యవశాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతోనే ప్రజలు తెదేపాని గెలిపించారని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనలో ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారన్నారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ప్రపంచస్థాయి రాజధాని కడతామని ప్రజలను మభ్యపెట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. రాజధానిలో శాశ్వత భవనాల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని విభజన చట్టంలో స్పష్టం ఉన్పప్పటికీ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తేలేదని ఆయన ప్రశ్నించారు. తాత్కాలిక నిర్మాణాల పేరుతో రూ.800కోట్లు రూపాయిల ప్రజాదనం దుర్వినియోగమైందన్నారు. భాజపా హయాంలో ఇచ్చిన మూడు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు రాజధాని నిర్మాణాలు జరగలేదని చెప్పారు. తెలంగాణతో మొన్నటి వరకు కత్తులు దూసుకున్న తెదేపా నాయకులు ఇప్పుడు ఎందుకు వారిని ఆలింగంనం చేసుకుంటున్నారో ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన నిధులు, ఎంవోయూలపై  శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

గందరగోళానికి గురి చేయటం తగదు 
భాజపా జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి 

విస్సన్నపేట, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్‌ విషయంలో రాష్ట్రంలోని భాజపాయేతర పార్టీలన్నీ ఏకమై రాష్ట్ర ప్రజలను గందరగోళ పరిస్థితులకు గురి చేయటం తగదని భాజపా జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి అన్నారు. మండల పార్టీ నాయకుడు మాచిన అరవింద్‌ తండ్రి రాజేంద్రప్రసాద్‌ ఇటీవల మృతిచెందగా, అరవింద్‌ను పరామర్శించేందుకు వచ్చిన ఆయన అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌ ఏ రాష్ట్రానికి సంబంధించినది కాకపోవటమే కాక, ఏ ఒక్క రాష్ట్రానికో ప్రత్యేక ప్రయోజనాలు కలిగేలా రూపకల్పన చేయరన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితిని గుర్తించి, బడ్జెట్‌తో సంబంధం లేకుండానే కొన్ని సంవత్సరాలుగా కేంద్రం రాష్ట్రానికి పెద్దమొత్తంలో నిధులు కేటాయించిందన్నారు. కేంద్రమంత్రిగా వెంకయ్యనాయుడు రాష్ట్రానికి రూ.2వేల కోట్ల ప్రయోజనాలు చేకూర్చటమేకాక, గృహ నిర్మాణ శాఖ ద్వారా ఆరు లక్షల ఇళ్లు కేటాయించినట్లు వివరించారు. దేశవ్యాప్తంగా రోజంతా విద్యుత్‌ సరఫరాకు మూడు రాష్ట్రాలను ఎంపిక చేయాల్సి ఉండగా, వాటిలో ఆంధ్రప్రదేశ్‌ను ఒకటిగా గుర్తించి, ప్రయోజనం చేకూర్చిందన్నారు. రాష్ట్రంలోని రహదారుల అభివృద్ధికి బడ్జెట్‌తో సంబంధం లేకుండా రూ.లక్ష కోట్లు కేటాయించినట్లు చెప్పారు. త్వరలో ఎన్నికలు సమీపిస్తున్నందున ఇప్పటి బడ్జెట్‌ను ఒక అంశంగా రాష్ట్రంలో బలోపేతమవుతున్న భాజపాకు వ్యతిరేకంగా మార్చేందుకు అన్ని రాజకీయపార్టీలు కుమ్మక్కై ఆందోళనలు చేస్తున్నాయన్నారు. రాష్ట్ర చరిత్రలో విపక్షాలన్నీ కలసి బంద్‌కు పిలుపునిస్తే, రాష్ట్ర ప్రభుత్వం మద్దతుగా పాఠశాలలకు సెలవు ప్రకటించి, ఆర్టీసీ బస్సులు నిలిపి, ప్రదర్శనలు చేస్తూ మద్దతు పలకటం మిత్రధర్మాన్ని వ్యతిరేకించటమేనన్నారు. బడ్జెట్‌ను అంగీకరిస్తూ కేంద్ర క్యాబినెట్‌లో ఆమోదం తెలుపుతూ తెదేపా మంత్రులే సంతకాలు చేశారని, వైకాపా ఎంపీలు బడ్జెట్‌ బాగుందని కితాబునిచ్చారన్నారు. సమావేశంలో జిల్లా మహిళామోర్చా అధ్యక్షురాలు పోలే శాంతి, జిల్లా కార్యదర్శి మీసాల సత్యనారాయణ, జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్‌ బాజీబాబా, సీనియర్‌ నాయకులు డా.జి.వీరభద్రరావు, తిరువూరు నియోజకవర్గ కన్వీనర్‌ దారా మాధవరావు, నాయకులు ఆడుమిల్లి మల్లయ్యస్వామి, సుందర్రావు, తుమ్మలపల్లి రమేష్‌, పి.రామచంద్రరావు తదితరులు ఉన్నారు.

Page 2 of 2

తాజా వార్తలు

©2018 APWebNews.com. All Rights Reserved.