కొల్లేటి పెద్దమ్మ సంబరం ప్రారంభం

కొల్లేటి పెద్దమ్మ సంబరం ప్రారంభం 
మార్చి 1 వరకు  శ్రీపెద్దింటి అమ్మవారి ఉత్సవాలు 

కొల్లేటికోట(కైకలూరు), న్యూస్‌టుడే: అమ్మలగన్నయమ్మ శ్రీకొల్లేటి పెద్దమ్మయని భక్తులు కొనియాడే శ్రీపెద్దింటి అమ్మవారి జాతర ఉత్సవాలను శుక్రవారం అత్యంత వైభవోపేతంగా ప్రారంభించారు. ఆలయ ఈవో ఆకుల కొండలరావు ఆధ్వర్యంలో అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ, వెంకట్రామయ్యలు ఉదయం 6 గంటల నుంచే విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచన, పంచామృత అభిషేకాలు, శ్రీచక్రార్చన, నూతన వస్త్రాలంకరణ, ధూపసేవ, బాలభోగం వంటి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, కొల్లేరు గ్రామాల పెద్దలు, నాయకులు అమ్మవారికి నూతన వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ  సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ శుక్రవారం నుంచి మార్చి ఒకటోతేదీ వరకు నిర్వహించే ఈ ఉత్సవాలకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారన్నారు. వందల ఏళ్లనాటి చరిత్ర ఉన్న అమ్మవారు చాలా మహిమగల దేవతగా పూజిస్తామన్నారు. భుజబలపట్నానికి చెందిన గొట్టుముక్కల శ్యామ్‌ప్రసాద్‌, కల్యాణి దంపతులు అమ్మవారికి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, భక్తులకు ఉచిత ప్రసాదం ఏర్పాటు చేశారు. ఉత్సవాల ప్రారంభానికి కొల్లేరు సంఘం ప్రధాన కార్యదర్శి బలే ఏసురాజు, ఎంపీపీ బండి సత్యవతి, జడ్పీటీసీ సభ్యురాలు బొమ్మనబోయిన విజయలక్ష్మి, తెదేపా నాయకులు సయ్యపురాజు గుర్రాజు, త్రినాథరాజు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఛైర్మన్‌ బలే చంటి, కొల్లేటికోట, పెంచికలమర్రు, పందిరిపల్లిగూడెం, శృంగవరప్పాడు, గోకర్ణపురం, వడ్లకూటితిప్ప గ్రామాల పెద్దలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. తహసీల్దార్‌ శ్రీనివాస్‌ నాయక్‌, సీఐ రవికుమార్‌, వివిధ శాఖల అధికారులు  పాల్గొన్నారు. సాయంత్రం శింగరాయపాలేనికి చెందిన ఆనందదాసు కృష్ణమూర్తి భగవతార్‌చే హరికథా కాలక్షేపం విశేషంగా అలరించింది.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.