మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట ...!

ఎపి వెబ్ న్యూస్.కామ్ 

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. సబ్సిడీపై వివిధ పరికరాలను మత్స్యకారులకు అందించే కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక టౌన్‌హాల్‌లో నిర్వహించారు.

కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలుచేస్తోందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా పురోభివృద్ధి సాధించాలని సూచించారు. వలలు, మోపెడ్లు, జీపీఎస్‌ సెట్లు, తదితరాలను ప్రభుత్వం 75 శాతం సబ్సిడీపై అందచేస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ చంద్రన్న బీమా నమోదు చేయించుకోవాలని సూచించారు. మత్స్యకారుల భూముల్లో సాగు చేసుకునేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నట్టు తెలిపారు. 50 సంవత్సరాలు దాటిన ప్రతి మత్య్సకారునికి ఫింఛను అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న ఆయిల్‌ సబ్సిడీని అధ్యయనం చేసి రాష్ట్రంలో రిజిష్టర్‌ అయిన బోట్లకు ఆయిల్‌ సబ్సిడీ ఇచ్చేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతి కుటుంబంలో ఒక్కరికే కాకుండా అర్హులైన అందరికి వర్తించేలా చర్యలు చేపట్టేందుకు తగు కృషి చేస్తున్నట్టు చెప్పారు. సముద్రంలో వేటకు ఉపయోగించే స్టీల్‌బోట్‌లను 50 శాతం సబ్సిడీతో అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ, రూ.80 లక్షలు విలువ చేసే బోట్‌ కోసం ప్రాజెక్టు రిపోర్ట్‌తో సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో భాగంగా రూ.73 లక్షల విలువైన వలలు, మోపెడ్లు, తదితరాలను 205 మంది లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ మోటమర్రి బాబాప్రసాద్‌, జడ్పీటీసీ సభ్యుడు లంకె నారాయణప్రసాద్‌, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, ఏఎంసీ ఛైర్మన్‌ చిలంకుర్తి సుబ్రమణ్యం, వైస్‌ ఛైర్మన్‌ అచ్యుతరామయ్య, మత్స్యకార సంఘ జిల్లా అధ్యక్షుడు కె.నాగరమేష్‌, మత్స్యశాఖ ఏడీ ఎ.వి.రాఘవరెడ్డి, ఎఫ్‌డీఓ రాజ్‌కుమార్‌, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.