విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి 

కడప విద్య, న్యూస్‌టుడే: ‘మీరనుకుంటున్నట్లుగా భూమి బల్లపరుపుగా లేదు గుండ్రంగా ఉందని చెప్పినందుకు ఒక శాస్త్రవేత్తను సలసలకాగే నూనెలో కాల్చి చంపారు. నూతన ఆవిష్కరణలను సమాజం హర్షించని కాలం నుంచి ఎన్నో అద్భుతాలకు వేదిక అవుతున్న ప్రస్తుత కాలం వరకూ కొత్త విషయాలు కనుగొనాలన్న ఆలోచనలు కలిగిన శాస్త్రవేత్తల త్యాగాలు ఆధునిక సమాజం వైపు మనల్ని నడిపిస్తున్నాయి. చంద్రగుప్తుని కాలంలోనే ఇనుమును గృహ నిర్మాణంలో వాడిన దేశం మనది. అయితే ఆ సృజనాత్మకత కాలక్రమేణా తగ్గిందని చెప్పవచ్చు. అమెరికా వంటి దేశాలలో జీడీపీలో 4.6 శాతం జాతీయ సంపదను పరిశోధనలకు ఖర్చు చేస్తుండగా మనదేశంలో 0.6 శాతం ఖర్చు చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో మళ్లీ కొత్త ఆవిష్కరణలకు ఊతమిచ్చే విధంగా కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 496 ప్రాజెక్టులను ప్రదర్శనకు తీసుకు వచ్చిన కడప జిల్లా విద్యార్థులు అభినందనీయులు. గతేడాది రెండు ప్రాజెక్టులు అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావడం ఆనందించాల్సిన విషయం. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందే శాస్త్రవేత్తలుగా మన జిల్లాలోని విద్యార్థులు ఎదగాలి’ అని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక సెయింట్‌ జోసెఫ్‌ ఇంగ్లీష్‌ మీడియం ఉన్నత పాఠశాలలో ‘జిల్లా స్థాయి ప్రేరణ మనాక్‌ వైజ్ఞానిక ప్రదర్శన - 2018’ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ.. తెలియని విషయాన్ని శోధించి విజ్ఞానాన్ని సంపాదించడమే సైన్స్‌ అన్నారు. ప్రకృతి ఒక ప్రయోగశాల అని అందులో నుంచీ కొత్త వస్తువులను కనుగొనవచ్చని తెలిపారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్వేత మాట్లాడుతూ.. సైన్స్‌ లేకుండా జీవనం లేదన్నారు. జిల్లాలో ఉపాధ్యాయులు కమిట్‌మెంట్‌తో పనిచేస్తుండటం వల్ల 496 ప్రాజెక్టులు ప్రదర్శనకు ఎంపికయ్యాయనీ వాటిని సరిగ్గా వివరించడం వల్ల రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు చేరుకోవాలన్నారు. మట్టిలో మాణిక్యాల్లా జిల్లా విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తున్నారన్నారు. ఎస్‌సీఈఆర్‌టీ ప్రొఫెసర్‌, రాష్ట్ర పరిశీలకులు లక్ష్మీవాట్స్‌ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా సైన్స్‌ ఉపాధ్యాయుల కృషి వల్లనే విద్యార్థులు ఈ స్థాయిలో ప్రాజెక్టులు రూపొందించగలిగారన్నారు. శాస్త్రవేత్తలను తయారు చేయగలిగిన సత్తా కలిగిన వారు సైన్స్‌ ఉపాధ్యాయులని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి శైలజ మాట్లాడుతూ.. దేశంలో అభివృద్ధిపరంగా వెనుకబడిన జిల్లాల జాబితాలో కడప జిల్లా ఉందనీ అయితే నాలెడ్జ్‌లో మాత్రం ఇక్కడి విద్యార్థులు ఎవ్వరికీ తీసిపోరన్నారు. జిల్లా నుంచి భావి భారత శాస్త్రవేత్తలు తయారు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి, జిల్లా సైన్స్‌ అధికారి డాక్టర్‌ రవికిరణ్‌, డైట్‌ ప్రిన్సిపల్‌ చంద్రయ్య, ఉప విద్యాశాఖాధికారులు జిలానీబాషా, నాగమునిరెడ్డి, పెంచలయ్య, ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీవీ నారాయణరెడ్డి, కడప మండల విద్యాశాఖాధికారి పాలెం నారాయణ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.