సీమలో హైకోర్టు కోసం సుదర్శన యాగం

సీమలో హైకోర్టు కోసం సుదర్శన యాగం 
కొనసాగుతున్న న్యాయవాదుల రిలే దీక్షలు 

చిన్నచౌకు (కడప), న్యూస్‌టుడే: రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ శనివారం కడప కోర్టు ఎదుట న్యాయవాది వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో సుదర్శన యాగం నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు యాగం చేశారు. యాగం వలనైనా చంద్రబాబు నాయుడుకు మంచి మనస్సు కలిగించి సీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటన చేయాలనే ఉద్ధేశంతో యాగం చేశారు. న్యాయవాదుల దీక్షలకు పలువురు మద్దతు తెలిపారు.. సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ శనివారం కోర్టు ఎదుట న్యాయవాదులు, న్యాయవాదుల గుమాస్తాలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 26వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. సీమ వ్యాప్తంగా హైకోర్టు కోసం వివిధ రూపాల్లో ఆందోళనలు జరుగుతుంటే పాలకులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తాము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్నారు, న్యాయబద్దంగా సీమ వాసులకు చెందాల్సిన హైకోర్టును ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి మాత్రం ఈ విషయంపై నోరుమెదపకపోవడం సరికాదన్నారు. ఉద్యమాన్ని ఇంతటితో విరమించే ప్రసక్తే లేదన్నారు. హైకోర్టు కోసం ఎంత దూరమైన వెళ్తామని చెప్పారు. శ్రీబాగ్‌ ఒడంబడిక, శ్రీకృష్ణ కమిషన్‌ సభ్యులు చెప్పినప్పటికీ సీమలో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామి ఇచ్చేంత వరకు వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు. ఎన్ని రోజులైన దీక్షలును కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీక్షల్లో కూర్చున్న వారిలో న్యాయవాది జి.నాగేశ్వరరావుతో పాటు న్యాయవాదుల గుమస్తాలైన ఎం.శ్రీనివాసులు, బి.రంగసాయి, ఆర్‌.మనోహర్‌నాయుడు, సీ.యోగాంజనేయరెడ్డి, వై.చంద్రఓబుల్‌రెడ్డి, వెంకటేష్‌, ఎం.రామ్మోహన్‌, లక్ష్మీనారాయణరెడ్డి, అమర్‌నాథ్‌, ఎస్‌.లక్ష్మీరెడ్డి, పి.వెంకటరమణలున్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు నిరంజన్‌కుమార్‌రెడ్డి, సుబ్రమణ్యం, భారవితో పాటు పలువురు న్యాయవాదులున్నారు.

తాజా వార్తలు

©2018 APWebNews.com. All Rights Reserved.