సత్యదేవుని సన్నిధిలో సౌరభం 
రూ.4.80కోట్లతో సోలార్‌ ప్లాంటుకు టెండర్లు పూర్తి 
ఏటా 1.66 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యం 

అన్నవరం, న్యూస్‌టుడే: దేవస్థానంలో సత్యగిరి కొండపై ఒక మెగా వాట్‌ సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు టెండర్ల పక్రియ పూర్తయింది. ఇందుకుగాను నెడ్‌క్యాప్‌ ఆధ్వర్యంలో ఇటీవల గుంటూరులో నిర్వహించిన టెండర్ల పక్రియలో మూడు సంస్థలు పాల్గొనగా ఓ ప్రముఖ సంస్థ రూ.4.80 కోట్లకు ఏర్పాటుకు ముందుకు వచ్చి టెండర్లు దక్కించుకుందని దేవస్థానం అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ సోలార్‌ పవర్‌ ప్లాంటు ద్వారా ఏటా 1.66 మెగా యూనిట్లు (16.66 లక్షల యూనిట్లు) విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో 4,000-4,500 సౌరఫలకాలతో ప్లాంటు ఏర్పాటు చేస్తారు. రోజుకు సుమారు 4,500 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని అంచనా. అన్నవరంలో సోలార్‌ ప్లాంటు ఏర్పాటుకు ఎంతో కాలంగా ప్రతిపాదన ఉంది. రాష్ట్రంలోని 7 ప్రధాన దేవస్థానాలకు కలిపి ఒకేచోట కృష్ణాజిల్లాలో 10 మెగావాట్‌ సోలార్‌ పవర్‌ ప్లాంటు నిర్మాణానికి గతంలో దేవాదాయశాఖ ప్రతిపాదన చేసింది. అయితే ఈ ప్రతిపాదన విరమించుకుంటూ ఆయా దేవస్థానాల పరిధిలోనే ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని ఆ తర్వాత ఆదేశాలు రావడం తదితర కారణాలతో జాప్యం జరిగింది. ప్రస్తుతం దేవస్థానంలో నెలకు 1.50 లక్షల యూనిట్లు చొప్పున ఏడాదికి సుమారు 18 లక్షల యూనిట్లు విద్యుత్తును వినియోగిస్తున్నారు. ప్లాంటు ఏర్పాటు వల్ల ఉత్పత్తి అయ్యే విద్యుత్తు దేవస్థానం అవసరాలకు దాదాపు సరిపోయే అవకాశం ఉంది. దీంతో విద్యుత్తు బిల్లుల సొమ్ము ఆదా కానుంది. గతంలో దేవస్థానం నుంచి ఏడాదికి రూ.2.50 కోట్లు వరకు విద్యుత్తు బిల్లులకు చెల్లించగా ప్రస్తుతం సుమారు రూ.1.20 కోట్లు చెల్లిస్తున్నారు. ఎల్‌ఈడీ దీపాలు అమర్చడం, పొదుపు చర్యలు పాటించడం, రాయితీ రావడంతో బిల్లుల భారం కాస్త తగ్గింది. ప్లాంటు ఏర్పాటుతో దేవస్థానం సొమ్ము ఆదా అవ్వడమే కాకుండా నాలుగేళ్లలో (పెట్టుబడికి అనుగుణంగా) ఉచితంగా విద్యుత్తు ఉత్పత్తి చేసుకునే స్థాయికి చేరుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.  చురుగ్గా పనులు చేపట్టి అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని ఈవో జితేంద్ర తెలిపారు.

ఈవోను శాశ్వతంగా తొలగించాలని ఆందోళన 

పిఠాపురం పట్టణం, న్యూస్‌టుడే: పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఆలయం ఎదుట భక్తులు, రద్దయిన ట్రస్టు బోర్డు సభ్యులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ట్రస్టు బోర్డు సభ్యులు అక్రమాలకు పాల్పడ్డారని ఈవో చందక దారబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అధికారం ఉందని ఉద్యోగాలు నియామకం, జీతాలు పెంచిన వ్యక్తిని సస్పెండ్‌ కాదని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఆయనను సస్పెండ్‌ చేయడంతో ఆలయం వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. అక్రమాలకు పాల్పడిన ఈవోపై దేవాదాయశాఖ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పాత కమిటీపై ఆరోపణలు చేసిన ఆయనే అవినీతికి పాల్పడినట్లు అధికారులు ధ్రువీకరించారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని భక్తులు, పాత ట్రస్టుబోర్డు సభ్యులు పాల్గొన్నారు.

కదంతొక్కిన ఎర్రదండు 
సీపీఐ జిల్లా మహాసభల్లో నేతలు 

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: పోరాటాలతోనే ప్రత్యేక హోదా సాధ్యమని, వామపక్షాలు, ఇతర పార్టీలు ఐక్యతతో ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఉందని సీపీఐ ప్రకటించింది. సీపీఐ జిల్లా 24వ మహాసభలు రాజమహేంద్రవరంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. సాయంత్రం సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య తదితరులు మాట్లాడారు. ఆంధ్రరాష్ట్రానికి ప్రధాని మోదీ గర్భశుత్రువని సీపీఐ ఆరోపించింది. కేంద్ర ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసి నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టిన మోదీ కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో తిరుపతి వేదికగా వాగ్దానాలు చేసిన మోదీ, రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం రాజకీయ కుట్రలో భాగమేనన్నారు. పోలవరం నిర్వాసితులకు రూ.33 వేల కోట్లు, ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 54వేల కోట్ల ఊసేలేదన్నారు. ఇప్పటికైనా తెదేపా, వైకాపాలు బతుకుదెరువు రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు. కేవలం రూ.1500 కోట్లు ఇచ్చి రాజధాని నిర్మాణం చేపట్టమని చెప్పడం దారుణమాన్నారు. మార్చి 5 కల్లా కేంద్రం స్పందించకుంటే దిల్లీ జంతర్‌మంతర్‌ వేదికగా ఉద్యమం తప్పదన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అంశమని, ప్యాకేజీ ముద్దు.. అంటూ చంద్రబాబు మొన్నటివరకూ కేంద్రం జపం చేశారని, ప్రజల్లో తిరుగుబాటు రావడంతో మాట మార్చారన్నారు. నోట్ల రద్దు సమయంలో ఏటీఎంల వద్ద నిల్చుని ప్రాణాలు పోగొట్టుకున్న వారి విషయంలో మోదీపై కేసు నమోదు చేయాలన్నారు. భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా కుమారుడి ధనార్జనపై ప్రశ్నించారు.

Page 4 of 4

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.