సత్యదేవుని సన్నిధిలో సౌరభం రూ.4.80కోట్లతో సోలార్‌ ప్లాంటుకు టెండర్లు పూర్తి

సత్యదేవుని సన్నిధిలో సౌరభం 
రూ.4.80కోట్లతో సోలార్‌ ప్లాంటుకు టెండర్లు పూర్తి 
ఏటా 1.66 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యం 

అన్నవరం, న్యూస్‌టుడే: దేవస్థానంలో సత్యగిరి కొండపై ఒక మెగా వాట్‌ సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు టెండర్ల పక్రియ పూర్తయింది. ఇందుకుగాను నెడ్‌క్యాప్‌ ఆధ్వర్యంలో ఇటీవల గుంటూరులో నిర్వహించిన టెండర్ల పక్రియలో మూడు సంస్థలు పాల్గొనగా ఓ ప్రముఖ సంస్థ రూ.4.80 కోట్లకు ఏర్పాటుకు ముందుకు వచ్చి టెండర్లు దక్కించుకుందని దేవస్థానం అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ సోలార్‌ పవర్‌ ప్లాంటు ద్వారా ఏటా 1.66 మెగా యూనిట్లు (16.66 లక్షల యూనిట్లు) విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో 4,000-4,500 సౌరఫలకాలతో ప్లాంటు ఏర్పాటు చేస్తారు. రోజుకు సుమారు 4,500 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని అంచనా. అన్నవరంలో సోలార్‌ ప్లాంటు ఏర్పాటుకు ఎంతో కాలంగా ప్రతిపాదన ఉంది. రాష్ట్రంలోని 7 ప్రధాన దేవస్థానాలకు కలిపి ఒకేచోట కృష్ణాజిల్లాలో 10 మెగావాట్‌ సోలార్‌ పవర్‌ ప్లాంటు నిర్మాణానికి గతంలో దేవాదాయశాఖ ప్రతిపాదన చేసింది. అయితే ఈ ప్రతిపాదన విరమించుకుంటూ ఆయా దేవస్థానాల పరిధిలోనే ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని ఆ తర్వాత ఆదేశాలు రావడం తదితర కారణాలతో జాప్యం జరిగింది. ప్రస్తుతం దేవస్థానంలో నెలకు 1.50 లక్షల యూనిట్లు చొప్పున ఏడాదికి సుమారు 18 లక్షల యూనిట్లు విద్యుత్తును వినియోగిస్తున్నారు. ప్లాంటు ఏర్పాటు వల్ల ఉత్పత్తి అయ్యే విద్యుత్తు దేవస్థానం అవసరాలకు దాదాపు సరిపోయే అవకాశం ఉంది. దీంతో విద్యుత్తు బిల్లుల సొమ్ము ఆదా కానుంది. గతంలో దేవస్థానం నుంచి ఏడాదికి రూ.2.50 కోట్లు వరకు విద్యుత్తు బిల్లులకు చెల్లించగా ప్రస్తుతం సుమారు రూ.1.20 కోట్లు చెల్లిస్తున్నారు. ఎల్‌ఈడీ దీపాలు అమర్చడం, పొదుపు చర్యలు పాటించడం, రాయితీ రావడంతో బిల్లుల భారం కాస్త తగ్గింది. ప్లాంటు ఏర్పాటుతో దేవస్థానం సొమ్ము ఆదా అవ్వడమే కాకుండా నాలుగేళ్లలో (పెట్టుబడికి అనుగుణంగా) ఉచితంగా విద్యుత్తు ఉత్పత్తి చేసుకునే స్థాయికి చేరుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.  చురుగ్గా పనులు చేపట్టి అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని ఈవో జితేంద్ర తెలిపారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.