కదంతొక్కిన ఎర్రదండు

కదంతొక్కిన ఎర్రదండు 
సీపీఐ జిల్లా మహాసభల్లో నేతలు 

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: పోరాటాలతోనే ప్రత్యేక హోదా సాధ్యమని, వామపక్షాలు, ఇతర పార్టీలు ఐక్యతతో ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఉందని సీపీఐ ప్రకటించింది. సీపీఐ జిల్లా 24వ మహాసభలు రాజమహేంద్రవరంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. సాయంత్రం సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య తదితరులు మాట్లాడారు. ఆంధ్రరాష్ట్రానికి ప్రధాని మోదీ గర్భశుత్రువని సీపీఐ ఆరోపించింది. కేంద్ర ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసి నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టిన మోదీ కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో తిరుపతి వేదికగా వాగ్దానాలు చేసిన మోదీ, రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం రాజకీయ కుట్రలో భాగమేనన్నారు. పోలవరం నిర్వాసితులకు రూ.33 వేల కోట్లు, ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 54వేల కోట్ల ఊసేలేదన్నారు. ఇప్పటికైనా తెదేపా, వైకాపాలు బతుకుదెరువు రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు. కేవలం రూ.1500 కోట్లు ఇచ్చి రాజధాని నిర్మాణం చేపట్టమని చెప్పడం దారుణమాన్నారు. మార్చి 5 కల్లా కేంద్రం స్పందించకుంటే దిల్లీ జంతర్‌మంతర్‌ వేదికగా ఉద్యమం తప్పదన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అంశమని, ప్యాకేజీ ముద్దు.. అంటూ చంద్రబాబు మొన్నటివరకూ కేంద్రం జపం చేశారని, ప్రజల్లో తిరుగుబాటు రావడంతో మాట మార్చారన్నారు. నోట్ల రద్దు సమయంలో ఏటీఎంల వద్ద నిల్చుని ప్రాణాలు పోగొట్టుకున్న వారి విషయంలో మోదీపై కేసు నమోదు చేయాలన్నారు. భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా కుమారుడి ధనార్జనపై ప్రశ్నించారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.