‘గిరి ప్రదక్షిణం’ పులకించిన భక్త జనం

‘గిరి ప్రదక్షిణం’ పులకించిన భక్త జనం 

భగవంతుడు.. భక్తుల చెంతకు వెళ్లే దివ్యక్షేత్రం శ్రీకాళహస్తి. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శివయ్య పెళ్లికి వచ్చిన బంధుగణాన్ని, సమస్త భక్తగణానికి వీడ్కోలు పలికేందుకు శనివారం నిర్వహించిన కైలాసగిరి ప్రదక్షిణోత్సవం ఆద్యంతం వైభవంగా సాగింది. 21 కిలోమీటర్ల పొడవునా వ్యాపించి ఉన్న కైలాసగిరి పర్వతశ్రేణుల చుట్టూ.. భక్తవత్సలుడైన భగవంతునితో పాటు వేలాది మంది భక్తులు నడుచుకుంటూ వెళ్లారు. విల్లంభులు ధరించిన పరమేష్ఠి ఆగమనంతో.. పల్లె ప్రాంతాలన్నీ పులకించిపోయాయి. నవ దంపతులకు అడుగడుగునా భక్తకోటి నీరాజనాలు పలుకుతూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. గిరిప్రదక్షిణ వెళ్లలేని భక్తులు ఎదురుగా శుకబ్రహ్మాశ్రమం వద్దకు వెళ్లి ఉత్సవమూర్తులకు స్వాగతం పలికారు. అనంతరం బంగారు అశ్వం, సింహవాహనాలపై పట్టణ వీధుల్లో ఊరేగుతూ ముక్కంటీశుడు భక్తులకు దర్శనభాగ్యం కల్పించాడు. వివాహ మహోత్సవం పూర్తయ్యాక.. నాగవల్లి కార్యక్రమాన్ని ఆగమోక్తంగా జరిపారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.