అడుగడుగునా నీరాజనం...!

ఎపి వెబ్ న్యూస్.కామ్

హైరోడ్డు విస్తరణ నిర్వాసితుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికి చిత్తూరు నగరానికి వచ్చిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు నగరవాసులు బ్రహ్మరథం పట్టారు.

తొలుత మంగళవారం మధ్యాహ్నం 2.20గంటలకు స్థానిక రెడ్డిగుంట కూడలికి చేరుకున్న ఆయనకు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీస్థాయిలో ఘన స్వాగతం పలికారు. పవన్‌ కల్యాణ్‌ వాహన శ్రేణి వెంట ద్విచక్రవాహనాలతో అభిమానులు ర్యాలీగా వచ్చారు. అనంతరం గిరింపేట దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించిన పవన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తూ ప్రతి ఐదుసెకన్లకు ఒకసారి అభివాదం చేశారు. ఈ సందర్భంలో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. జనం సైతం పవన్‌ కల్యాణ్‌ను చూడటానికి భారీగా రోడ్లపైకి, భవనాలపైకి చేరుకున్నారు. దుర్గమ్మ ఆలయం వద్ద హైరోడ్డు విస్తరణ నిర్వాసితుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంలో జనసేన కార్యకర్తలు, హైరోడ్డు బాధితులు చప్పట్లతో పెద్దఎత్తున హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఓ ఇంటిలోకి వెళ్లిన పవన్‌ కల్యాణ్‌ హైరోడ్డు బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దారి పొడవునా ఓపెన్‌ టాప్‌ కారుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చిన జనసేన అధినేతపై... కార్యకర్తలు, అభిమానులు పూల వర్షం కురిపించారు. దాదాపు గంట పాటు గిరింపేట దుర్గమ్మ ఆలయం సమీపంలోనే వాహనంలో ఉంటూ ఆయన ప్రసంగించారు. అనంతరం 3.20గంటలకు చౌడేశ్వరమ్మ ఆలయం నుంచి నేరుగా గాంధీ విగ్రహ కూడలికి వాహన శ్రేణి చేరుకుంది. అప్పటికే ఆ కూడలిలో అధిక సంఖ్యలో వేచిఉన్న అభిమానులకు ఆయన పలుమార్లు అభివాదం చేశారు. ఈ సందర్భంగా విజయ చిహ్నంగా పిడికిలిని చూపిస్తూ అభిమానులను ఉత్తేజ పరిచారు. జాతీయ జెండాను చేత పట్టుకుని గాలిలో ఊపడంతో అభిమానులు పెద్దఎత్తున కేకలు, ఈలలు వేసి మద్దతు తెలియజేశారు. అనంతరం గాంధీవిగ్రహ కూడలి నుంచి నేరుగా బయలుదేరి వెళ్లారు. 

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.