ఎపి వెబ్ న్యూస్.కామ్

హైరోడ్డు విస్తరణ నిర్వాసితుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికి చిత్తూరు నగరానికి వచ్చిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు నగరవాసులు బ్రహ్మరథం పట్టారు.

సమాజానికి నైతికత నేర్పేదే నాటకం 
అట్టహాసంగా ‘హనుమ అవార్డ్స్‌’ ప్రారంభం 
ఆలోచింపజేసిన ‘ఆకాశ దేవర’ 
బలరామయ్య నటనకు ప్రశంసలు 

తిరుపతి (సాంస్కృతికం), న్యూస్‌టుడే: సమాజానికి నైతికతను నేర్పేదే నాటక రంగమని పలువురు వక్తలు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖలు, సినిమా, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ, తితిదే సంయుక్త సహకారంతో తిరుపతి అభినయ ఆర్ట్స్‌ ‘హనుమ అవార్డ్స్‌’ పేరుతో నిర్వహిస్తున్న 18వ జాతీయస్థాయి పద్య నాటకాలు, సాంఘిక నాటికలు, శాస్త్రీయ, జానపద, బృంద నృత్య పోటీలు శనివారం స్థానిక మహతి కళాక్షేత్రంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ మాట్లాడుతూ సమాజ స్థితిగతులకు అద్దం పట్టేలా సాంఘిక నాటికలు ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. సమాజాన్ని ఇవి చైతన్యవంతం చేస్తున్నాయన్నారు. అదే సందర్భంలో పద్యనాటకాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. నాటకోత్సవాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సాయంత్రం జరిగిన కార్యక్రమంలో తితిదే మాజీ డిప్యూటీ ఈఓ చిన్నంగారి రమణ మాట్లాడుతూ కళలను, కళాకారులను ప్రోత్సహించడానికి తితిదే తొలి నుంచి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఏపీ నాటక అకాడమీ ఉపాధ్యక్షుడు కందిమళ్ల సాంబశివరావు మాట్లాడుతూ నాటకోత్సవాలను ప్రోత్సహిస్తామన్నారు. అభినయ ఆర్ట్స్‌ వ్యవస్థాపక కార్యదర్శి బీఎన్‌ రెడ్డి మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యపరిచే శక్తిసామర్థ్యాలు కళలకు, కళాకారులకు మాత్రమే ఉన్నాయన్నారు.

‘గిరి ప్రదక్షిణం’ పులకించిన భక్త జనం 

భగవంతుడు.. భక్తుల చెంతకు వెళ్లే దివ్యక్షేత్రం శ్రీకాళహస్తి. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శివయ్య పెళ్లికి వచ్చిన బంధుగణాన్ని, సమస్త భక్తగణానికి వీడ్కోలు పలికేందుకు శనివారం నిర్వహించిన కైలాసగిరి ప్రదక్షిణోత్సవం ఆద్యంతం వైభవంగా సాగింది. 21 కిలోమీటర్ల పొడవునా వ్యాపించి ఉన్న కైలాసగిరి పర్వతశ్రేణుల చుట్టూ.. భక్తవత్సలుడైన భగవంతునితో పాటు వేలాది మంది భక్తులు నడుచుకుంటూ వెళ్లారు. విల్లంభులు ధరించిన పరమేష్ఠి ఆగమనంతో.. పల్లె ప్రాంతాలన్నీ పులకించిపోయాయి. నవ దంపతులకు అడుగడుగునా భక్తకోటి నీరాజనాలు పలుకుతూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. గిరిప్రదక్షిణ వెళ్లలేని భక్తులు ఎదురుగా శుకబ్రహ్మాశ్రమం వద్దకు వెళ్లి ఉత్సవమూర్తులకు స్వాగతం పలికారు. అనంతరం బంగారు అశ్వం, సింహవాహనాలపై పట్టణ వీధుల్లో ఊరేగుతూ ముక్కంటీశుడు భక్తులకు దర్శనభాగ్యం కల్పించాడు. వివాహ మహోత్సవం పూర్తయ్యాక.. నాగవల్లి కార్యక్రమాన్ని ఆగమోక్తంగా జరిపారు.

రుయా’కు దాతల సాయం కావాలి 
జిల్లా పాలనాధికారి ప్రద్యుమ్న పిలుపు 
రాష్ట్రంలోనే తొలి బ్యాటరీ స్ట్రెచర్‌ ప్రారంభం 

తిరుపతి (వైద్యవిభాగం), న్యూస్‌టుడే: పేదలు అత్యధికంగా వచ్చే ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో సౌకర్యాల మెరుగుకు దాతలు చేయూతనందించాలని జిల్లా పాలనాధికారి, రుయా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ ప్రద్యుమ్న పిలుపునిచ్చారు. ఆసుపత్రిలో రాష్ట్రంలోనే తొలిసారిగా బ్యాటరీ స్ట్రెచర్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు చిన్నబాబు ఆధ్వర్యంలో చిత్తూరు సహకార బ్యాంకు (డీసీసీబీ) అధ్యక్షుడు అమాసరాజశేఖర్‌ రెడ్డి రూ.5 లక్షల విలువైన ఈ స్ట్రెచర్‌ను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ఆసుపత్రిలో 17కు పైగా విభాగాలకు సంబంధించిన బ్లాకులు ఉన్నాయని వాటి వద్దకు రోగులను తీసుకెళ్లేందుకు ఈ స్ట్రెచర్‌ ఉపయోగపడుతుందన్నారు. పర్యావరణ హితకరమైన బ్యాటరీలతో నడిచే వాహనాలను భవిష్యత్తులో మనం కూడా ఉపయోగించాల్సి వస్తుందన్నారు. రుయాలో సౌకర్యాల మెరుగుకు దాతలు ముందుకు రావాలంటూ, బ్యాంకులు ఈ దిశగా దృష్టి సారించాలని కోరారు. దాత అమాస రాజశేఖర్‌రెడ్డి, హెచ్‌డీఎస్‌ సభ్యుడు చిన్నబాబులను అభినందించారు. రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ జిల్లా పాలనాధికారి చొరవతో స్ట్రెచర్‌ను అందించినట్లు తెలిపారు. వాహన చోదకులకు ఒక సంవత్సరం వేతనాన్ని కూడా చెల్లిస్తామని తెలిపారు. రుయా అభివృద్ధి కమిటీ సభ్యురాలు డాక్టర్‌ సుధారాణి మాట్లాడుతూ ఆసుపత్రిని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామన్నారు. అందులో భాగంగా రూ.2 లక్షలతో త్వరలోనే డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంతకు ముందు జిల్లా పాలనాధికారి ప్రద్యుమ్న స్వయంగా బ్యాటరీ స్ట్రెచర్‌ను నడిపి పరిశీలించారు. అనంతరం సూపరింటెండెంట్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆసుపత్రి ప్రగతిని సమీక్షించారు. ఆసుపత్రిలో బయోమెట్రిక్‌ పనితీరును అడిగి తెలుసుకున్నారు.  ఈ కార్యక్రమంలో రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సిద్దానాయక్‌, ఎస్వీ వైద్యకళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌.వి.రమణయ్య, ఆర్‌ఎంవో డాక్టర్‌ శ్రీహరి, ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భవానీ, ఆర్‌ఎంవో డాక్టర్‌ విద్యావతి, ఏపీఎంఎస్‌ఐడీసీ సభ్యుడు డాక్టర్‌ సిపాయి సుబ్రహ్మణ్యం, వైద్యులు పాల్గొన్నారు.

పరిశోధనల్లో భారత్‌ ముందంజ 
విజయవంతంగా ముగిసిన ఇన్‌స్పైర్‌ ఎగ్జిబిషన్‌-18 
తిరుపతి నుంచి రాష్ట్రస్థాయికి 37 ప్రదర్శనల ఎంపిక 

తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: శాస్త్ర, సాంకేతిక పరిశోధనలలో భారతదేశం ముందంజలో ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల వేదికగా మూడు రోజుల పాటు అత్యద్భుతంగా జరిగిన జిల్లాస్థాయి ఇన్‌స్పైర్‌ ఎగ్జిబిషన్‌-2018 శనివారం ముగిసింది. ముగింపు సమావేశంలో తిరుపతి శాసనసభ్యురాలు సుగుణమ్మ మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుందని, ఇలాంటి ప్రదర్శనలను ప్రతి విద్యార్థి తిలకించాలన్నారు. గ్రామీణ విద్యార్థులు అత్యధికంగా పాల్గొన్ని పలు నూతన ఆవిష్కరణలు చేశారన్నారు. గ్రామీణ ప్రతిభను వెలికి తీయడానికి ఈ కార్యక్రమం దోహదపడిందని, ఇక్కడ విజేతలుగా కాలేని విద్యార్థులు నిరాశకు గురికాకుండా మరిన్ని నూతన పరిశోధనలపై పట్టు సాధించాలన్నారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పాతికేళ్ల క్రితం ఎందరో గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారని, 15 ఏళ్లుగా పూర్తిగా తగ్గిపోయారన్నారు. నూతన పరిశోధనలపై అధ్యయనం చేస్తున్నా అద్భుత ఆవిష్కరణలు రావడానికి కావాల్సిన సహాయ, సహకారాలు అందడం లేదన్నారు. ప్రస్తుత విద్యావిధానంలో సైన్స్‌ను ఒక పాఠంలా చెబుతున్నారన్నారు. ఎక్కడో చూసి ఎక్కడి నుంచో తెచ్చి సాధిస్తున్న పరిశోధన పట్టాపై విద్యార్థులు ఆత్మశోధన చేసుకోవాలన్నారు. సైన్స్‌ కాంగ్రెస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సైన్స్‌ అంతరించిపోతోందని, ఇంగ్లిష్‌ భాష కారణంగా ఈ దుస్థితి వచ్చిందని చెప్పారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలతో రాష్ట్రం ప్రపంచ దేశాల్లో ఖ్యాతి గడించిందన్నారు. శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం ప్రపంచదేశాలు మనవైపు చూసేలా చేసిందని, అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు నూతన ఆవిష్కరణలు, పరిశోధనలతో అద్భుత విజయాలు సాధించారన్నారు. బాలభవన్‌, పాఠశాలల విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

పంచతంత్రం! 
ఎర్ర చందనం అక్రమ రవాణా కట్టడికి 5 మార్గాలు 
సిద్ధం చేసిన ప్రత్యేక కార్యదళం 
నిఘా.. మార్పు.. చైతన్యమే లక్ష్యం 
అన్ని మార్గాల్లోనూ స్మగ్లర్లపై దాడి 

ఈనాడు, తిరుపతి : ఎర్ర రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక కార్యదళం సిద్ధమవుతోంది. మొదటి దశలో అయిదు దారులను ఎంచుకొని.. వాటిని పక్కాగా అమలు చేసి స్మగ్లర్ల కార్యకలాపాలను తగ్గించాలనేది ప్రణాళిక. అయిదు మార్గాలను ఇప్పటికే సిద్ధం చేశారు. దీనిద్వారా 80 శాతం కార్యకలాపాలు తగ్గించి, ఎర్రచందనం వృక్షాలను రక్షించాలని భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలోనూ దీన్ని అమలు చేసేందుకు ప్రత్యేక స్క్వాడ్‌లను కార్యదళం సిద్ధం చేస్తోంది. ఇటు ప్రభుత్వం కూడా ప్రత్యేక కార్యదళానికి పూర్తిస్థాయి అధికారాలను ఇచ్చి... దీన్ని పటిష్ఠం చేయాలని భావిస్తోంది. ఎర్రచందనం రవాణా నానాటికీ ఎక్కువవుతుందే తప్ప.. ఆగడం లేదు. పాతతరం వెళ్లిపోయిన తర్వాత.. కొత్త 
స్మగ్లర్లు రంగంలోకి దిగి అడవుల్లోని చెట్లను నరికేస్తున్నారు. ప్రత్యేక కార్యదళంతో పాటు పోలీసులు దాడులు చేసినా ఫలితం ఉండటం లేదు. స్మగ్లర్ల మూలాల్లోకి వెళ్లి వారిలో పరివర్తన తీసుకొచ్చేందుకు  ప్రత్యేక కార్యదళం ఆలోచనలు చేస్తోంది. దీనివల్ల స్మగ్లర్లతో పాటు వారి కుటుంబసభ్యులకు తగిన హెచ్చరికలు జారీ చేసి.. అడవిలోకి వస్తే వచ్చే నష్టాలను వివరించాలని ఆలోచిస్తున్నారు. దీంతోపాటు అడవులకు దగ్గరున్న ప్రజల్లోనూ పూర్తిస్థాయిలో చైతన్యం నింపి... స్మగ్లర్లు తారసపడితే వెంటనే సమాచారం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.

తీపి బతుకుల్లో.. చేదు నిజాలు 
వేధిస్తున్న కూలీల కొరత 
ఎండుతున్న చెరకు పంట 
ఆందోళనలో అన్నదాత 

ఎండనక, వాననక, పగలనక, రాత్రినక రైతులు ఏడాదిపాటు శ్రమటోర్చి సాగు చేసిన చెరకు చేదు దిగుబడిని ఇస్తోంది. చేతికొచ్చిన పంటను నరికేందుకు కూలీలు దొరకని పరిస్థితి. ఫలితంగా పంట పొలంలోనే ఎండుతోంది. పండిన పంట అమ్ముకోలేక.. సాగుకు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో అన్నదాత పరిస్థితి అగమ్యజిల్లాలో ప్రధానంగా వేరుసెనగ, మామిడి అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. తరువాత స్థానం చెరకు పంటదే. ఎక్కువ భాగం తూర్పు మండలాల రైతులు ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు. ఒకప్పుడు జిల్లాలో 20వేల హెక్టార్లకు పైగా పంట సాగు చేసేవారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తే గణనీయంగా పడిపోయింది. 2017-18 సంవత్సరంలో మొదటి పంట(నాట్లు) 2వేల హెక్టార్లలో సాగుచేయగా.. రెండో పంట(మర్థాం) 7484 హెక్టార్లుగా ఉంది. 2015-16 సంవత్సరంలో తొలిపంట 4082హెక్టార్లలో.. మర్థాం పంట 16,958 హెక్టార్లలో సాగైంది. 2016-17 సంవత్సరంలో నాట్లు 6495హెక్టార్లు, మర్థాం 15,052హెక్టార్లలో సాగుచేశారు. జిల్లాలో సుమారు 10వేల మంది రైతులు పంటపై ఆధారపడ్డారు. ఒకప్పుడు సుమారు 20వేల మంది రైతులు చెరకు సాగు చేసేవారు. క్రమేపి వారి సంఖ్య తగ్గిపోతోంది.

తాజా వార్తలు

©2018 APWebNews.com. All Rights Reserved.