సాధారణత, సాత్వికతలే విశ్వాసి ఆభరణాలు..!

నిశ్శబ్దంగా ప్రార్థనలు సాగుతున్న చర్చిలో అతని సెల్‌ఫోన్‌ పొరపాటున మోగింది. పాస్టర్‌ కోప్పడ్డాడు, విశ్వాసులంతా అతన్ని వింతజీవిలాగా చూశారు, భార్యాపిల్లలు కూడా విసుక్కున్నారు. అతను ఇక ఎన్నడూ చర్చికి వెళ్ళలేదు.

సంయమనం, క్షమాపణ, పరస్పర గౌరవం, ప్రేమ, మృదుభాష్యం, సహకారధోరణి, సత్స్పందన, సహృదయం ఇవన్నీ విశ్వాసులు, చర్చిల్లో విధిగా ఉండాలన్నది  యేసు బోధ, అభిమతం,  జీవితం కూడా. వాటినే వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు సొంతం చేసుకొని స్వలాభం కోసం బ్రహ్మాండంగా వాడుకొంటున్నారు.

పరిసయ్యులు, అంటే ధర్మశాస్త్రాన్ని ఆమూలాగ్రం చదివి దానికి భాష్యం చెప్పే మతపెద్దల జీవనశైలి ఆరోజుల్లో అత్యున్నతమైన విలువలతో నిండి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కాని వారు దైవప్రతినిధులుగా కంటే, దేవునికి తామే మారుపేర్లమన్నట్లు నిరక్షరాస్యులను, సామాన్యులను, నిరుపేదలను పురుగుల కన్నా హీనంగా చూసేవారు. అందుకే బలహీనులు, నిరుపేదలు, నిరాశ్రయులతో మమేకమై జీవించిన యేసు ‘వారు మీతో చెప్పినట్టు చెయ్యండి, కాని వారు చేసినట్టు చెయ్యకండి. మోయలేనంత భారాన్ని వాళ్ళు మీ భుజాలమీద పెడతారు, కాని తమ వేలితోనైనా దాన్ని వారు కదిలించరు’ అంటూ శాస్త్రులు, పరిసయ్యుల నీతిని ఎండగట్టాడు (మత్త23:3.4). వారి నీతికంటె మీ నీతి ఉన్నతంగా లేకపోతే మీరు పరలోకరాజ్యంలో ప్రవేశించరని ఆయన సాధారణ విశ్వాసులను హెచ్చరించాడు (మత్త 5:20).

క్రీస్తు జీవితంలో, బోధల్లో ప్రతిధ్వనించిన, పరిమళించిన సోదరప్రేమ, సుహృద్భావం, క్షమాపణ, మృదుభాష్యం, సాత్వికత్వం, నిర్మలత్వం చర్చిలు, విశ్వాసుల కుటుంబాల్లో కనిపించకపోతే వారు ఆయన అనుచరులు ఎలా అవుతారు? తన బోధలు మాటల్లో, ప్రసంగాల్లోకన్నా విశ్వాసుల జీవితాల్లో ఆచరణలో కనిపించాలని కోరుకున్న యేసు ప్రభువుకు అసంతృప్తిని మిగుల్చుతూ,   ప్రసంగాల హోరుతో కూడిన ‘ధ్వని కాలుష్యమే’ తప్ప, ఆయన బోధలతో జీవనసాఫల్యం పొందిన విశ్వాసుల దాఖలాలేవీ? తాను దేవుడై ఉండీ, యేసుప్రభువు సామాన్య ప్రజలతో కలిసిపోయి జీవించగా, నిరుపేదలు, సామాన్య ప్రజలు తమను తాకినా మైలపడిపోతామన్న విధంగా నాటి పరిసయ్యులు అంగరక్షకులను వెంబడేసుకొని మరీ వారికి దూరంగా వీధుల్లో తిరిగే వారు, సరిగ్గా ఈనాటి సెలెబ్రిటీ దైవసేవకుల్లాగే!! ‘‘సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు (మత్త 5:5)’’ అన్న క్రీస్తు బోధనల  సర్వసారాంశమే మనకర్ధం కాకపోతే, ఆచరణీయం కాకపోతే ఎలా? విశ్వాసుల మధ్య అసూయ, శత్రుత్వం ఏ రూపంలో కూడా ఉండేందుకు దేవుడు అనుమతించడు. తన అన్న ఏశావుతో శత్రుత్వమే ఆదిమ పితరుడు యాకోబును అతని జన్మస్థలం కానాను వదిలి పారిపోయేలా చేసింది.

సొంత సోదరుడైన యోసేపుతో శత్రుత్వమే అన్నలు అతన్ని బానిసగా అమ్మేయడానికి దారి తీసింది. ఆ శతృత్వభావమే మోషే ఫరోకు దూరంగా మిద్యానుకు పారిపోయేలా చేసింది. కాని కొత్తనిబంధన కాలపు క్షమాముద్రపడిన పేతురు స్వభావరీత్యా బొంకేవాడు, బలహీనుడైనా, మార్పునొంది క్షమాపణోద్యమానికి మూలస్తంభమయ్యాడు. మునుపు యేసుప్రభువును, ఆయన చర్చిని విపరీతంగా ద్వేషించిన అపొస్తలుడైన పౌలు యేసుప్రేమలో తడిసి మారిపోయి ప్రపంచమంతా క్షమాపణా సువార్తను ప్రకటించాడు, సహనానికి ప్రతీకగా మారాడు.

శత్రుత్వం, అసూయాతత్వం చరిత్రలో ఎన్నో గొప్ప నగరాలు, నాగరికతలు సమసిపోవడానికి కారణమయ్యాయి. డాబు, దర్పం, ఈర‡్ష్య, పోటీతత్వాలకు స్వస్తి పలికి సరళంగా, సాత్వికంగా, ప్రేమాపూర్ణతతో జీవించడమే దేవునికి మనమివ్వగలిగిన  గొప్ప బహుమానం. నిజమైన పశ్చాత్తా్తపంతో కలిగిన మారుమనస్సు విశ్వాసిలో దీనత్వాన్ని రగిలిస్తుంది. దీనత్వాన్ని కలిగిన విశ్వాసులు ఈ లోకాన్నే పరలోక రాజ్యంగా మార్చుతారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.