వినయంతోనే దైవానుగ్రహం..!

లఘుతాసే ప్రభుతా మిలే, ప్రభుతాసే ప్రభు దూరిచీంటి లే సెక్కర్‌ చలీ, హాథీకే సిర్‌ ధూరి

అల్పునిగా నమ్రతతో అణిగిమణిగి ఉన్న చీమకు దైవ సమానమైన మధుర పదార్థం (చక్కెర) ప్రాప్తిస్తుంది. అహంకారంతో ‘నేను’ అంటూ గంభీరంగా నడిచే ఏనుగుకు ఏమీ లభించకపోవడంతో ధూళిని మాత్రమే తలపై చిమ్ముకుంటుందని దీని అర్థం. వినయంగా ఉన్నవాడు ఎప్పటికైనా భగవంతుణ్ణి చేరగలుగుతాడని, మనసులోని అహంకారం భగవంతుడికి దూరం చేస్తుందని ఆయన పద్యంలోని అంతరార్థం. వినయం.. వ్యక్తిత్వ నిర్మాణంలోనే కాదు, ఆధ్యాత్మిక అభివృద్ధిలో కూడా గొప్ప పాత్ర పోషించి దైవానుగ్రహానికి మార్గం సులభం చేస్తుంది. వినయసంపద గొప్పదనాన్ని తెలిపే కథ ఒకటి భారతంలో ఉంది. అదేంటంటే.. ఒకసారి సత్యభామ శ్రీకృష్ణునితో ‘స్వామీ.. రామావతారంలో సీత మీ భార్యకదా! ఆమె నాకంటే అందంగా ఉండేదా?’ అని అడిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న గరుడుడు ‘ప్రభూ, నాకంటే వేగంగా ఈ ప్రపంచంలో ఎవరైనా ప్రయాణించగలరా?’ అన్నాడు.
 
పక్కనే ఉన్న సుదర్శనుడు(సుదర్శన చక్రం) కూడా.. ‘పరంధామా, అనేక యుద్ధాల్లో పాల్గొని మీకు విజయాన్ని తెచ్చిపెట్టాను. నాతో సరితూగువారెవరు స్వామి’ అన్నది. ముగ్గురి మాటలూ విన్న నందగోపాలుడు వారికి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. దీర్ఘంగా ఆలోచించి.. ‘సత్యా, నువ్వు సీతగా మారిపో. నేను రాముణ్నవుతాను. గరుడా నువ్వు ఆంజనేయుని దగ్గరికి వెళ్లి సీతారాములు నిన్ను తీసుకురమ్మన్నారని చెప్పి తోడ్కనిరా. చక్రమా, నా అనుమతి లేనిదే ఎవరూ లోపలికి ప్రవేశించకుండా చూడు’ అంటూ ముగ్గురికీ మూడు బాధ్యతలు అప్పగించాడు. గరుత్మంతుడు హనుమంతుని వద్దకు వెళ్లి.. సీతారాములు రమ్మన్నారని చెప్పాడు. హనుమ ఆనందంతో పులకించిపోతూ.. ‘నేను నీ వెనుకే వస్తాను. నువ్వు పద’ అని గరుత్మంతుని సాగనంపుతాడు. ఈ ముసలి వానరం రావడానికి ఎంతకాలమవుతుందో కదా అనుకుంటూ గరుడుడు రివ్వున ఆకాశానికి ఎగురుతాడు. కానీ.. ఆయనకంటే ముందే హనుమ ద్వారక చేరడంతో గరుత్మంతునికి మతిపోతుంది. సిగ్గుతో తలదించుకొని మౌనంగా ఉండిపోతాడు.
 
ఇంతలో.. ‘హనుమా’ అన్నపిలుపుతో పులకించిన ఆంజనేయుడు తన రామునివైపు చూశాడు. ‘లోనికి రావడానికి నిన్నెవరూ అడ్డగించలేదా?’ అని అడగ్గా.. హనుమ తన నోటి నుండి చక్రాన్ని తీస్తూ ‘ప్రభూ, ఇదిగో ఈయన నన్ను లోపలికి రాకుండా ఆపాడు. ఎన్ని చెప్పినా వినకపోవడంతో ఇక లాభం లేదని భావించి నోట్లో పెట్టుకొని మీ ముందు వచ్చి నిలిచాను’ అన్నాడు సుదర్శనుడు కూడా గరుడని వలె అవమానంతో నేల చూపులు చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో హనుమంతుని చూపు తన రాముని పక్కన కూర్చున్న స్ర్తీపై పడి ‘స్వామీ, మీ పక్కనుండవల్సింది నా తల్లి సీతమ్మకదా! ఎవరీవిడ ప్రభూ’ అన్న మాటలు విన్నదే తడువుగా సత్యభామకు కూడా గర్వభంగమై ప్రభువు కాళ్ళమీద పడింది. అలా కృష్ణ పరమాత్ముడు, ముగ్గురిలో మొగ్గతొడిగిన గర్వాన్ని తుంచివేసి వినయానికున్న విలువేమిటో తెలియచెప్పాడు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.