ధనుర్మాస వైభవం..!

వేకువ జామునే ప్రతి ఇంటి ముంగిట కల్లాపి జిల్లి రంగు రంగుల రంగవల్లికలు దిద్ది ఆపై పేడతో రూపొందించిన గొబ్బెమ్మలు పెట్టి పసుపుపచ్చని తంగేడుపూలు అలంకరించి కనె్నపిల్లలు గొబ్బి పాటలతో, తప్పెటలతో చుట్టూ తిరుగుతూంటే ధనుర్మాసం ప్రవేశించిందని అర్థం.

ఆ సమయంలో జియ్యరులు తలపై అక్షయపాత్రతో చిందులు వేస్తూ ప్రతి ఇంటి ముందర సందడిచెయ్యడం, జంగమయ్యలు గంటం తిప్పుతూ పాటలు పల్లవించడం ధనుర్మాసానికి స్వాగతించినట్లు సంకేతంగా నిలుస్తాయి.ఈ దృశ్యాలు దశాబ్దలకుముందు పల్లెలలో, పట్టణాల్లో కనువిందు చేసే కమ్మని దృశ్యాలు. మన సంస్కృతికి నిలువుటద్దాలు. భారతీయ సంస్కృతిలో ఒకవైపు ఆధ్యాత్మిక జ్ఞాన సంపత్తి, మరొకవైపు భౌతిక జీవన మాధుర్యాన్ని అందించే అద్భుతాలు సమ్మిళితమై ఉంటాయి. అన్నివర్గాలవారి అభిరుచులు, ఆప్యాయతలు పెనవేసుకుని ఉల్లాస, ఉత్సాహాలకు వెల్లివిరుస్తాయి..ఈ పర్వాలు, పండుగలు జ్యోతిష శాస్తప్రరంగా, తిథి, నక్షత్ర, ఋతువులను, గ్రహసంచారాన్ని ఆధారంచేసుకుని మన ప్రాచీన ఋషులు నిర్ణయించారు. ఏసమయంలో ఏఏ పర్వాలు, పండుగలు నిర్వహించాలో సవివరంగా చెప్పారు. అటువంటి పర్వాలలో ‘్ధనుర్మాసం’ ముఖ్యమైనది.ఆధునిక కాలంలో పట్టణాలు, నగరాలలోని ప్రజలు అపార్టుమెంట్ సంస్కృతికి, పాశ్చాత్య నాగరికతకు అలవడ్డం చేత ఈ చక్కని సమైక్య జీవన మాధుర్యాన్నిఅనుభవించలేని దుర్గతి ప్రాప్తమైంది. ఇప్పటికీ పల్లె ప్రాంతాల్లో ఈ సంస్కృతి సంప్రదాయాలు మసకబారిపోకుండా ఉండడం మన అదృష్టం. పండుగలు, వాటి వైభవాలు, వాటి వెనుకగల ఆధ్యాత్మిక విలువలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉంటే ఈ మాసంలో గ్రామాలను దర్శించాలి.‘మాసానాం మార్గశీర్షోహం’ అన్నాడు గీతాచార్యుడు. శ్రీకృష్ణపరమాత్మ మార్గశీర్షమాసం స్వరూపాన్ని తానే అనడంలోనే ఎంతో విశేషముంది. ఈ మాసం ఎంతో పవిత్రమైనదని, ఎంతో మహిమాన్వితమైనదని ఆ మాటల్లో నిక్షిప్తపమయ్యాయి. జ్యోతిషశాస్త్ర రీత్యా రవి సంచారంతో ఈ మాసం ముడిపడి ఉంది. రవి మేషాది ద్వాదశ రాశుల్లో ఒక్కొక్క మాసం ఒక్కొక్క రాశిలో నివాసం ఉంటాడు. రవి ధనుస్సురాశిలో ప్రవేశించినప్పటినుండి తిరిగి మకరరాశిలో (మకర సంక్రాంతి ముందురోజు భోగి పండుగనాడు) ప్రవేశించేవరకు ధనుర్మాసంగా పరిగణనను పొందింది.కార్తికమాసం ప్రధానంగా శివపరంగా ఖ్యాతినార్జించుకుంది. మార్గశిర పుష్యమాసాలలో ఉండే ధనుర్మాసం శ్రీమహావిష్ణువుకు, అతని అనపాయినియైన లక్ష్మీదేవికి ఎంతో ప్రియం. విష్ణు సంబంధిత పర్వాలన్నీ ధనుర్మాసంలో సంభవించడం విశేషం. మార్గశిర గురు (లక్ష్మీ) వారాలలో ముతె్తైదువలు లక్ష్మీపూజలు చేస్తారు. విశాఖపట్నంలోని శ్రీ కనకమహాలక్ష్మికి మార్గశిర మాసోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
ఇవి ఒక ఎతె్తైతే ధనుర్మాసం వైష్ణవ సంప్రదాయంలో ప్రత్యేకమైనది. ధనుర్మాసవ్రతం పలు వైష్ణవ కుటుంబాల్లో ఆచరిస్తారు. శ్రీమహావిష్ణువును ‘మధుసూదనుడు’ అను పేర నెల రోజులపాటు షోడశోపచారాలతో అర్చిస్తారు. ఈ వ్రతం ఆచరించడంవల్ల శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం.
ధనుర్మాసంలోనే గోదాదేవి శ్రీరంగనాధుని భర్తగా పొందగోరి మార్గళి వ్రతాన్ని ఆచరించింది. స్నాన వ్రతమని, శ్రీవ్రతమని వ్యవహరించే ఈవ్రతాన్ని, ద్వాపరయుగంలో గోపికలు ఆచరించిన కాత్యాయినీ వ్రతంవలె వేకువనే లేచి తనను తాను గొల్లపడుచుగా భావించుకుని, తానున్న విల్లిపుత్తూరును వ్రేపల్లెగా, గొల్లకట్టుతో, గొల్లకొప్పుతో రంగనాథుని రోజుకొక పాశురము రచించి, దానిని మధురంగా గానం చేస్తూ, వాఙ్మవికగా శ్రీరంగనాథునికి అర్పించింది. మాసంపాటు ప్రతిరోజు పాడిన పాశురాలు తమిళ వాఙ్మయంలో అత్యంత ప్రసిద్ధి పొందడమేకాక, తమిళుల ‘నాలాయిరం’ గ్రంథంలో చోటుచేసుకున్నాయి. ఈ ముప్పది పాశురాల గ్రంథం ‘తిరుప్పావై’ అన్న పేరును సంతరించుకుంది. ఇది దివ్య ప్రబంధమని పండితులు పేర్కొంటారు. ధనుర్మాసం కడపటిరోజున (్భగినాడు) గోదా రంగనాథుల కల్యాణం వైష్ణవాలయాల్లో దివ్యంగా జరుగుతుంది.అదేవిధంగా ధనుర్మాసంలో ‘తిరుప్పావై’ వలె, మాణిక్యవాచకులు పాడిన ‘తిరువెంచావై’ పాటలు పరమశివుని నాయకునిగా భావించి భక్తి శృంగారములు మేళవించినవి అని కంచి మహాస్వామి వారన్నారు.‘తిరుప్పావై’ పాశురాలను వైష్ణవ దేవాలయాలలో సుప్రభాత సమయంలో గానం చేస్తే, ‘తిరువెంచావై’ పాటలను శివాలయాల్లో సుప్రభాత సమయంలో గానం చేయడం ధనుర్మాసంలోని ప్రత్యేకత.శైవ, వైష్ణవ దేవాలయాల్లో ‘తిరువెంచావై’, ‘తిరుప్పావై’ పాటలను ఉషఃకాలంలో ధనుర్మాసమంతా అందరూ గానం చేయాలని కంచి మహాస్వామివారు పలు సభల్లో ప్రజలకు విజ్ఞప్తి చేసేవారు.ధనుర్మాసవ్రతమును ముతె్తైదువులు ‘మార్గళి’వ్రతాన్ని కనె్నపిల్లలు, తెలుగు ప్రాంతాల్లో మార్గశిర లక్ష్మీవారపు నోములు ఆచరిస్తూ ధన్యత పొందుతున్నారు. ఆరోగ్యరీత్యా వేకువన స్నానం చేయడం, ఆయా వ్రతాల్లో చెప్పినవిధంగా చేసిన నివేదనలు మంచి ఆరోగ్యాన్ని ప్రస్తావిస్తాయని ఆయుర్వేద శాస్త్రం అంటున్నది.
అత్యంత పవిత్రమైన, భక్తిదాయకమైన ధనుర్మాసంలో శివకేశవుల ఆరాధన శ్రేయోదాయకం, మోక్షదాయకం.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.