“లెమ్ము-రమ్ము” ARISE AND COME..!

అంజూరపు కాయులు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసన నిచ్చుచున్నవి, నా ప్రియులారా, సుందరవతీ,  లెమ్ము - రమ్ము పరమగీతం:2:13

పరిశుద్ధ గ్రంథములోన పరమ గీతాన్ని జ్ఞానియైన సోలోమోను వ్రాశాడు. పరమగీతం పరిశుద్ధ గ్రంధమందు ప్రత్యేకంగా పొందుపర్చిన పవిత్రమైన గ్రంథం. పరమగీతం ఆత్మయొక్క ప్రేమ గీతాసారం. పరిశుద్దాత్మ దేవుడు దేవుని మర్మములన్నిటిని తెలియజేస్తాడు. ఆ నిద్రావస్థలో వున్న నేటి క్రైస్తవ సమాజాన్ని మేలు కొలిపేందుకు మేల్కొన్న విశ్వాస వీరులను లేక యౌవ్వన వీరులను ఆత్మీయంగా ఆహ్వానించేటందుకు “లెమ్ము-రమ్ము” అనే రెండు పదాలను ఎంపిక చేసికోవడం దైవ చిత్తమే.

“లెమ్ము (ఎఫెసి 5:14) : నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము అంటూ అపోస్తలుడైన పౌలు ఎఫెసి సంఘానికి హెచ్చరించాడు. మరణించిన వ్యక్తి తిరిగి లేవగలిగితే లోకం తనను మృత్యుంజయుడంటుంది. ఇక్కడ మాట మృతుల్లో నుండి లెమ్మనడంలో ఆత్మీయంగా చెప్పుకుంటే అవిశ్వాసమనే మృత కవచము నుండి బయటకి రమ్మని భావించాలి. యెషయా:60:1 నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము. అని ఈ లోకానికి వెలుగైయున్న క్రీస్తు మొదటి రాకడను గూర్చి కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే యెషయా ప్రవక్త ప్రవచించి యున్నాడు. నీకు వెలుగు రావడమంటే క్రీస్తే నీ యొద్దకు వచ్చాడని ఆ వచ్చిన క్రీస్తును అంగీకరించగలిగితే, అలాంటివారంతా వెలుగు బిడ్డలుగా కాగలరు. లెమ్ము అవే యీ ప్రత్యేకపదము నేటి యౌవన బృందాలను భుజం తట్టి పలుకరిస్తున్నట్లు. పరమగీతం 2:13 ప్రకారము సుందరవతీ... లెమ్ము... రమ్ము అనడంతో యువతరాన్ని ఆత్మీయ సౌందర్యంతో చూడాలని యేసుకోర్కె ఈ పాప లోకంలో ముడిపడియున్న యువ జనాంగము క్రీస్తు కోసం క్రీస్తు సువార్త పరిచర్యకు సహాయపడు సాధనాలవ్వడం కోసం. పదే పదే వినిపించబడే ఉత్తేజపూరితమైన ఒకే ఒక పదం లెమ్ము.

రమ్ము : (పరమగీతం 4:8) : ప్రాణేశ్వరీ. లెబానోను విడిచి నాతో కూడ రమ్ము అనే మాటల్లో జ్ఞాన అభ్యాసముంది. లెబానోను అనే మాటకు తెల్లనివి, సౌందర్యముతో కూడిన అనే అర్థాలున్నాయి. లెబానోను పర్వత ప్రాంతము హిమము చేత కప్పబడడాన్ని బట్టి ఆ పేరు వచ్చినట్లు తెలుసుకోగలము. లెబానోను పర్వత శ్రేణి సంవత్సరములో ఆరు మాసములు మంచుతో కప్పబడి, ఆ తరువాత ఆరు మాసములు కూడా తెల్లని సున్నపు రాతి కొండల్లా కనిపిస్తూ వుంటాయి. ఇలాంటి కొండ ప్రాంతాల్లో వున్న సౌందర్యాన్ని విడిచి రమ్మంటుంది ఎవరో కాదు. మనకొరకు ప్రాణం పెట్టి తన సౌందర్యాన్ని లోక పాపం కోసం త్యాగం చేసిన ప్రేమామయుడైన యేసే... ఆహ్వానిస్తున్నాడు. తన రెండు చేతులు చాచి రమ్మని మధురంగా పిలుస్తున్నాడు. యాకోబు:4:8 దేవుని యొద్దకు రండి. అప్పుడాయన మీ యొద్దకు వచ్చును. మన చుట్టూ వున్న ఆకర్షణలు అందచందాలు అశాశ్వతాలు. క్రీస్తుతో గడిపే మధురక్షణాలు అనంతాలు. అందుకే ఆ శాశ్వత ఆకర్షణగా ఉన్న లెబానోను లాంటి యీ లోకాన్ని లోకంలో ఆకర్షించే పాపాన్ని సంపూర్తిగా విడిచి నాతో కూడా రమ్ము అని పిలుస్తున్న యేసు మాట మనకు బంగారు మాట. మత్తయి:11:28లో కూడా నా యొద్దకు రండి అని స్పష్టంగా చెబుతున్న యేసు మాటను గుర్తు చేసుకుందాము. యేసు యొద్దకు మనం రాగలిగితే యేసుతో కూడ జీవించడానికి వీలవుతుంది. కాబట్టి మనకు శ్రేష్ఠమైన అనుకూల సమయం. యేసుతో కలిసి జీవిస్తే పొందే ఆనందం ఆత్మీయమైంది. ఈ ఆనందాన్ని ఇరుగు పొరుగు వారికందరికి పంచి, వారికి ఆదరణ కలిగించటానికి మనకు వినిపిస్తున్న ఒకే ఒక పిలుపే రమ్ము. లే లెమ్ము సోదరుడా నిద్రనుండి ప్రకటించు యేసు నామమును రారమ్ము సోదరుడా యేసు చెంతకు ప్రేమతో జాలితో పిలుచుచున్నాడు. ప్రియమైన యౌవ్వనస్థుడా! నీ సంఘం మేల్కొల్పడానికి మొదట లెమ్ము - లేచి సుస్థిరతను ఏర్పాటుచేసుకొని, నీ బలీయమై సాక్ష్య సాధనంతో అనేకులను ఆత్మీయంగా ఆహ్వానించగలిగితే, ఆ ఆత్మీయ ఆహ్వానమే “రమ్ము” అనేక్రీస్తు ఆశీర్వాదకరమైన పిలుపు. అందుకే సమాజపరంగా లెమ్ము... క్రీస్తుకు పరిమళ సువాసనగా వుండేందుకు సకుటుంబ సమేతంగా దైవనామ మహిమార్థమై రమ్ము - దేవుడు మిమ్మును దీవించునుగాక.

మేజర్: J.V రత్నం                                                                                                                                        

(THE SALVATION ARMY)

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.