మస్జిద్‌ అంటే..!

మస్జిద్‌’ అంటే ‘సజ్దా’ (మోకరిల్లి ప్రార్థన) చేసే చోటు అని అర్థం. ప్రత్యేకంగా అల్లాహ్‌ ఆరాధన కోసం నిర్మించిన ఆలయాన్ని ‘మస్జిద్‌’ అంటారు. నమాజ్‌ చేయాలనుకొనేవారందరూ అక్కడికి వెళ్తారు.

సామూహికంగా నమాజ్‌ చేస్తారు. మస్జిద్‌ను కేవలం ఆరాధనాలయంగా మాత్రమే భావించకూడదు. వాస్తవానికి ఈ మస్జిద్‌లు ఇస్లామీయ కోటలు. ఇస్లాం ధర్మ కేంద్రాలు. ఇక్కడి నుంచే ఇస్లాం వెలుగు ప్రపంచంలోని నలు దిశలకూ వ్యాపించి, విశ్వాన్నంతటినీ జ్యోతిర్మయం చేస్తుంది. ఈ మస్జిద్‌ల నుంచే సరైన ఇస్లామీయ బోధనలు జనబాహుళ్యంలో ప్రచారం పొందుతాయి. స్వచ్ఛమైన ఏకదైవోపాసనకు ప్రాచుర్యం లభిస్తుంది. మస్జిద్‌లో ముస్లింలందరూ తమతమ బేధాలన్నీ కట్టిపెట్టి, పాలూనీళ్ళలా కలిసిపోతారు. అల్పుడు, అధికుడు, పేదవాడు, ధనికుడు, అరబ్బు, అరబ్బేతరుడు, పట్టణవాసి, పల్లెవాసి, నల్లవాడు, తెల్లవాడు అనే బేధభావాలన్నీ మరచి ఒకే వరుసలో నిలుచుంటారు.

 అంతిమ దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా తెలిపారు:
‘‘అల్లా్‌హనూ, అంతిమ దినాన్నీ విశ్వసించి నమాజును స్థాపించేవారూ, జకాత్‌ను ఇచ్చేవారూ, అల్లా్‌హకు తప్ప మరెవరికీ భయపడని వారూ మాత్రమే అల్లా్‌హకు చెందిన మస్జిద్‌కు సంరక్షకులూ, సేవకులూ కాగలుగుతారు’’ (దివ్య ఖుర్‌ఆన్‌ 9:18)
 
 అంతిమ దైవప్రవక్త మహమ్మద్‌ ఇలా సెలవిచ్చారు:
  • మీరు ఒక వ్యక్తిని మస్జిద్‌కు వస్తూ, పోతూ ఉండగా చూసినట్టయితే, అతని విశ్వాసం (ఈమాన్‌) గురించి సాక్ష్యం ఇవ్వండి.
  • అల్లాహ్‌ దృష్టిలో అన్ని ప్రదేశాలలో అత్యంత శ్రేయస్కరమైన చోటు పవిత్ర మస్జిద్‌.
  • ఎవరయితే ఐదు పూటలూ మస్జిద్‌కు వెళ్తారో వారి ఆతిథ్యం కోసం స్వర్గంలో బసను అల్లాహ్‌ ఏర్పాటు చేస్తాడు.
  • ఎవరయినా అల్లాహ్‌ కోసం మస్జిద్‌ను నిర్మిస్తే, అతని కోసం స్వర్గంలో ఒక అందమైన ఇంటిని అల్లాహ్‌ నిర్మిస్తాడు.
  • ఎవరయినా ఇంటి దగ్గర వుజా చేసుకొని (ముఖం, చేతులు, కాళ్ళు కడుక్కొని) మస్జిద్‌కు వెళ్ళి, నమాజ్‌ చేసి వస్తే, అతను ప్రతి అడుగూ ఒక పాపాన్ని తుడిచివేస్తుంది. మరోవైపు ఒక అంతస్తును పెంచుతుంది. అంటే అతను వేసే ప్రతి అడుగుకూ బదులుగా అతని కర్మల పత్రంలో ఒక పుణ్యం లిఖితం అవుతుంది. అతని పరలోకపు అంతస్తులు పెరుగుతాయి. పాపాల్ని మన్నించడం జరుగుతుంది.
  • మస్జిదె నబవీ (మదీన)లో చేసే ఒక నమాజ్‌ ఇతర మస్జిద్‌లలో చేసే వెయ్యి నమాజుల కంటే శ్రేష్ఠమైనది.
  • మస్జిదె హరామ్‌ (మక్కా)లో చేసే ఒక నమాజ్‌ ఇతర మస్జిద్‌లలో చేసే లక్ష నమాజుల కంటే శ్రేష్ఠమైనది.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.