శ్రద్ధయే శర్వాణి.. విశ్వాసమే విశ్వనాథుడు..!

 

భవాన్‌ శంకరౌ వందే శ్రద్ధా విశ్వాస రూపిణౌ
యాభ్యాం వినా నపశ్యంతి సిద్ధాః స్వాంతస్థమీశ్వరమ్‌
మహాకవి తులసీదాస్‌ విరచిత ‘రామ చరిత మానస’మనే రామాయణ ప్రారంభంలో ప్రార్థనా శ్లోకమిది. ‘పార్వతీ పరమేశ్వరులు శ్రద్ధావిశ్వాసాలకు ప్రతిరూపులు. అణిమాది సిద్ధులను వశీకరించుకుని భౌతిక సంపదలు సాధించిన సిద్ధులు కూడా శ్రద్ధా విశ్వాసాలు లేకపోతే కేవలం తర్క-వితర్కాల వలన తమలోనే ఉన్న ఈశ్వర దర్శనం చేయలేర’ని శ్లోక తాత్పర్యం. ఒకరికొకరు తపఃఫలంగా (నిజ తపఃఫలాభ్యాం) ఏర్పడిన ఉమామహేశుల వలె శ్రద్ధా విశ్వాసాలు పరస్పర పూరకాలు. శ్రద్ధ కలవానికే జ్ఞాన ప్రాప్తి అని; అజ్ఞాని, శ్రద్ధ లేనివాడు, సంశయగ్రస్తుడు నశింతురని; శంకిత మనస్కునికి ఇహ-పరాలు, సుఖము కూడా ఉండవని గీతాచార్యుని హెచ్చరికలు. ఒక ధార్మిక లేక తాత్త్విక విషయం పట్ల అచంచలమైన దృష్టి, దాన్ని సమగ్రంగా తెలుసుకోవాలనే తీవ్ర ఉత్కంఠే శ్రద్ధ. అత్యంత సూక్ష్మ విషయాన్ని, రహస్యాన్ని శ్రద్ధ ఉంటేగాని గ్రహించలేము. పరమ శివుని బోధలైన ఆగమ శాస్ర్తాలలో పార్వతీ దేవికి ఉన్న నిశ్చల భక్తియే శ్రద్ధ. ‘యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్ధితా నమస్తస్యై’ (సమస్త స్ర్తీ, పురుషులలో శ్రద్ధా రూపంగా వెలుగు దుర్గాదేవికి నమస్కారం) అన్న మార్కండేయ పురాణ ప్రమాణాన్ని బట్టి పార్వతి శ్రద్ధా రూపిణి.
 
మహాభారతం శాంతి పర్వంలోని ‘తులాధార-జాజలి’ సంవాదంలో - ‘కర్మకాండలో ఉచ్చారణ దోషం ఏర్పడినా, మనఃచాంచల్యం వలన ఇష్ట దేవతా ధ్యానంలో విక్షేపం కల్గినా.. శ్రద్ధ ఉంటే ఆ దోషాలు తొలగిపోతాయి. ఆ శ్రద్ధే లోపిస్తే కేవల మంత్రోచ్చారణ వలన, ధ్యానాదుల వలన కర్మ సిద్ధించదు. శ్రద్ధలేని కర్మ వ్యర్ధం. శ్రద్ధావంతుడు సాక్షాత్‌ ధర్మ స్వరూపుడు. ‘అశ్రద్ధా పరమం పాపం శ్రద్ధా పాప ప్రమోచనీ’ -అశ్రద్ధ అతిపెద్ద పాపం. శ్రద్ధ పాప విమోచని. ధ్యాన, జపాల కన్నా శ్రద్ధా మహిమ అధికం. పాము కుబుసం విడిచినట్లు శ్రద్ధాళువు పాపాన్ని వదిలించుకోగలడు’ అని వక్కాణింపబడింది. పద్మపురాణం భూమి ఖండంలో.. ‘శ్రద్ధాదేవి ధర్మదేవత పుత్రిక. ‘పావనీ విశ్వభావినీ’.. సావిత్రి వలె పవిత్రమైనది. ప్రపంచాన్ని ప్రగతి పథంలో నడిపించేది, సంసార సాగరాన్ని తరింపజేసేది’గా వర్ణింపబడింది. భక్తి జ్ఞానాలకు కూడా శ్రద్ధ ఆవశ్యకం. మహామనీషి వినోబా భావేగారు శ్రద్ధను పాత్రతోను మిగిలిన సాధనాలన్నింటిని పదార్థాలతోను పోల్చి, పాత్రలేని పదార్థాలకు మనుగడ, భద్రత లేదన్నారు. శ్రద్ధ లేనిచో సాధనలకు సిద్ధి లేదు. శ్రీరమణులు శ్రద్ధను బట్టి సిద్ధి దగ్గరవుతుందన్నారు. ‘క్షతే మక్షికాపాతః(ఈగ పుండు మీదే వాలుతుంది)’ అన్నట్లు మనిషికి తప్పులెంచడం సహజ ప్రవృత్తి. అంతటా ఏదో ఒక దోషం ఉండనే ఉంటుంది. శ్రద్ధ ఈ దోష దర్శనం తొలగించి విశ్వాసం కల్గిస్తుంది.
 
మూర్తీభవించిన విశ్వాసమే విశ్వనాథుడు. తన ఇష్టదైవమైన రాముని నామం వీద ఉన్న అఖండ, అవిచల విశ్వాసం వల్లనే క్షీరసాగర మథనంలో పుట్టిన కాలకూట విషం తాగి కంఠంలో దాచుకోగలిగాడు. అది అమృతస్వరూపమై ‘నీలకంఠ’ రూపంగా శాశ్వత ఆభరణమైంది. ‘ఓపశుపతే! లోకానికి నీవు చేసిన ఈ మహోపకారం ఒక్కటి(నాలం వా) చాలదా?’ అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరి స్తోత్రంలో. పంచముఖ(శివ) రూప విశ్వాసానికి కూడా పంచలక్షణాలు.
 
అవి.. 1.భగవానుడు మనకన్నా ఎక్కువ బుద్ధిమంతుడు- ‘ప్రజ్ఞానం బ్రహ్మ’. 2. ఆయన ఎప్పుడూ ఎలాంటి పొరపాటూ చెయ్యడు 3. మన బాగోగులు ఆయనకు బాగా తెలుసు. 4. ఆయన సర్వసమర్థుడు 5. ఆయన సర్వసుహృత్‌- అందరికీ మేలు చేసే అనుకూలుడు. అట్టి భగవంతుని యందు శ్రద్ధా విశ్వాసాలు కల్గిన భక్తుడు.. ‘స్వామీ! నీవనుకున్నదే జరగనీ. నీ సంకల్పమే సుసంకల్పం అగుగాక’ అని ప్రార్థిస్తూ భగవత్సంకల్పంలో, భగవదిచ్ఛలో తన సంకల్పాన్ని, ఇచ్ఛను లీనం చేసి నిశ్చింతగా బ్రతుకుతాడు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.