త్రిమూర్తుల చిహ్నాలు : వాటి ప్రాముఖ్యత ....!

హిందూ దేవుళ్లలో త్రిమూర్తులైన, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అత్యంత ప్రసిద్ధి చెందిన దేవతలుగా ఉన్నారు. వారిలో బ్రహ్మ సృష్టికర్త కాగా, విష్ణువు సృష్టిని నడిపేవానిగా మరియు శివుడు సృష్టి నాశనకారిగా తమ విధులను కలిగి ఉన్నారు.

విష్ణు భగవానునికి మరియు శివునికి అనేక దేవాలయాలు ఉన్నప్పటికీ, బ్రహ్మ దేవుడికి మాత్రం ఒకే ఒక ఆలయం ఉంది. నిజానికి ఈ విషయం అనేకమందికి తెలీదు కూడా. దీనికి కారణం కోపిష్టి మరియు గర్విష్టి అయిన బృగుమహర్షి శాపంగా చెప్పబడినది. బృగు మహర్షి శాపం కారణంగా శివుడు లింగ రూపాన పూజలు అందుకోవలసి వచ్చింది, బ్రహ్మ దేవునికి భూమి మీద గుడి లేని పరిస్థితి( అయినా కూడా ఒక ఆలయం ఉంది). విష్ణువుకు శాపం పెట్టలేదు కానీ, కాలితో తన్ని అవమాన పరచిన కారణంగా విష్ణువు శ్రీనివాసుని అవతారం ధరించవలసి వచ్చింది. ఇక్కడ ప్రతి దేవునికి, దైవ కార్యాలకై ఉద్దేశించబడిన వస్తువులు వారి చేతులలో ఇమిడి ఉంటాయి. అవేమిటో, వాటి ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రహ్మ:

బ్రహ్మ విశ్వం యొక్క సృష్టికర్త. పుట్టుకే లేని నిరాకారునిగా బ్రహ్మను పిలుస్తారు. మరియు స్వయంభూ అని కూడా పిలుస్తారు, అనగా తనకుతానే జన్మించాడు. బ్రహ్మ దేవుని భార్య సరస్వతి దేవి. ఈ ప్రపంచం మొత్తం మీద బ్రహ్మకు ఒకే ఒక్క ఆలయం ఉంది, అది కూడా రాజస్థాన్, అజ్మీర్ జిల్లాలోని, పుష్కర్లో ఉంది. ఇక్కడ బ్రహ్మ దేవుడు నాలుగు తలలు, మరియు నాలుగు చేతులతో దర్శనమిస్తాడు. ఈ నాలుగు తలలు హిందూ మతం లోని నాలుగు వేదాలను సూచిoచగా, నాలుగు చేతులలో వివిధములైన పవిత్ర వస్తువులను కలిగి ఉంటాడు. ఈ వస్తువులు దేవునికి చెందిన కొన్ని ప్రత్యేక లక్షణాల చిహ్నాలుగా ఉంటాయి. వీటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నాలుగు ముఖాలు:

బ్రహ్మ యొక్క నాలుగు ముఖాలు నాలుగు ప్రధాన దిక్కులను సూచిస్తాయి. అతను సృష్టికర్త అని పిలువబడుతున్నందున, విశ్వానికి నలువైపుల ఒకే సమయంలో చూడగలిగేలా ఉంటాడు. తద్వారా సృష్టికి సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తూ ఉంటాడు. అతని చేతులు ఆయుధాలను కలిగి ఉండవు, ఎందుకంటే అతను సృష్టికర్త. ఆయుధాలను నాశనం చేయడానికి ఉపయోగిస్తారు కాని సృష్టి కోసం కాదు. తన నాలుగు చేతులలో, వేదాలు, జపమాల, దివ్యజ్యోతి లేదా తామర పూవుని మరియు ఒక చేతిలో నీటి కమండలాన్ని కలిగి ఉంటాడు.

వేదాలు: వేదాలు ఈ విశ్వానికి మార్గదర్శకoగా వ్యవహరిస్తాయి.

జపమాల: జపమాల సమయాన్ని సూచిస్తుంది.

దివ్య జ్యోతి : భూమిపై నివసిస్తున్న జీవజాలానికి అగ్ని ప్రాముఖ్యతను సూచిస్తుంది.

కమండలo: నీటి కమండలo, జీవితానికి ప్రాధమిక వనరైన నీటి అవసరాన్ని సూచిస్తుంది.

తామరపూవు: తామరపూవు మీద కూర్చున్న బ్రహ్మ దేవుడు, దేవుని వాస్తవిక ప్రతిరూపానికి అద్దంలా ప్రతిబింబిస్తుంది.           

విష్ణు భగవానుడు :

విష్ణు భగవానుడు భూమి మీద ఉన్న జీవజాలాన్ని, సృష్టిని రక్షిoచే భాద్యతలను కలిగి ఉన్నాడు. తద్వారా కేవలం విష్ణు భగవానుడు మాత్రమే జీవనాన్ని నియంత్రించగలిగే విధంగా ఉంటాడు. సృష్టిలో అధర్మాన్ని నాశనం చేసి, ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలోనూ తన అవతారాలతో సృష్టిని కాపాడుతూ వస్తున్నాడు. ఈ ధర్మ సంస్థాపనలో భాగంగా తనకు అవసరమైన దైవ సంబంధిత వస్తువులను ఎల్లప్పుడూ కలిగి ఉంటాడు.

సుదర్శన చక్రo:

ఇది ఒక వృత్తాకార చక్రం, తన వేలు కొన వద్ద నిరంతరంగా తిరుగుతూ ఉంటుంది. ఇది భూమిపై జీవజాలాల కొనసాగింపును సూచిస్తుంది. ఇది ప్రకృతి భీభత్సాలను కూడా సూచిస్తుంది. ఈ చక్రం ఆరు కాలాలుగా విభజించబడింది. ఇది ఆరు ఋతువులకు చిహ్నంగా కూడా ఉంటుంది, తద్వారా సమయాన్ని సూచిస్తుంది. మరియు సూర్యుని , భూమిపై శక్తి ప్రసరణను కూడా సూచిస్తుంది. అత్యవసర సమయాల్లో మాత్రమే సుదర్శనాన్ని ప్రయోగిస్తాడు విష్ణువు.

శoఖం:

శంఖం, జీవితం మీద ఆధారపడిన పంచ భూతాలను సూచిస్తుంది, ఇవి నీరు, అగ్ని, గాలి, భూమి మరియు ఆకాశం. విష్ణువు శంఖానికి ఉన్న మరొక పేరు పాంచజన్యం. పాండవుల శoఖాలకు కూడా పేర్లు ఉన్నాయి. ధర్మరాజు శంఖాన్ని అనంత విజయమని, అర్జునునిది దేవదత్తమని, భీమునిది పౌoడ్రకమని, నకులునిది సుఘోష అని, సహదేవుని శంఖాన్ని మణిపుష్పకమని పిలుస్తారు.

గద :

ఇది మానవాళికి హాని కలిగించే అన్ని అవాంఛిత అమానుష లక్షణాల నాశనాన్ని సూచిస్తుంది. ఇది మానసిక మరియు శారీరక బలానికి చిహ్నంగా ఉంది.

తామర పూవు :

తామరపూవు స్వచ్ఛత మరియు నిజాన్ని సూచిస్తుంది. జాగృతం స్పృహలకు చిహ్నంగా ఉంటుంది.

పరమ శివుడు :

పరమేశ్వరుని సృష్టి నాశనకారిగా అభివర్ణిస్తారు. ఉనికిలోకి వచ్చే ప్రతి ఒక్క అంశం చివరికి నాశనం కావాలి. కాబట్టి, చావు పుట్టుకల చక్రాన్ని నియంత్రించే దేవునిగా పరమశివుడు ఉంటాడు. తద్వారా ప్రతి యుగాన్ని నాశనం చేసి, నూతన యుగానికి శ్రీకారం చుట్టే దేవునిగా శివుని భాద్యతలు ఉంటాయి. పరమశివుడి వర్ణనలో భాగంగా ముడిపడిఉన్న గుర్తులు క్రింద పేర్కొన్న విధంగా ఉన్నాయి.

చంద్ర వంక:

దీనిని నెలవంక అనికూడా అంటారు. ఇది సమయ చక్రాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా, వేదాలలో ఒక శ్లోకం ప్రకారం, చంద్రుడు మరియు రుద్రుడు ఇద్దరూ సృష్టి నాశనంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

త్రిశూలం :

పరమశివుని యొక్క త్రిశూలం మూడు గుణాలను సూచిస్తుంది - సత్వ, రాజ మరియు తమ. వేర్వేరు గుణాలు వేరు వేరు నిష్పత్తులలో ఉన్నప్పటికీ , వీటి మధ్య సమతౌల్య అవసరాన్ని సూచిస్తుంది.

డమరుఖం :

శివుడి యొక్క డమరుఖం తన నటరాజపు భంగిమ ప్రధాన గుణంగా చెప్పబడింది, మరియు ఓంకారం, ప్రమదగణాలకు పుట్టినిల్లుగా ఈ డమరుఖం ఉంది.

పాము:

శివుడు అంటేనే మెడలో పాము స్పురిస్తుంది. పాము ప్రమాదాలను సూచిస్తుంది. శివుడు ఎటువంటి ప్రమాదాన్నైనా తట్టుకోగలడు మరియు పరమేశ్వరుడు వాటిని అన్నిటినీ అధిగమించే శక్తిని కలిగి ఉన్నాడు. హాలాహలాన్నే మింగి గరళ కంఠునిగా మారిన శివునికి మెడలో పాము అలంకార ప్రాయమే అయినా, ఎటువంటి ప్రమాదాలతో అయినా ఆడుకోగలడని చెప్పకనే చెప్తున్నట్లు ఉంటుంది. 

©2019 APWebNews.com. All Rights Reserved.