కంపెనీలన్నీ ఐటీ రిటర్నులు వేయాల్సిందే!

  • రూ.3,000 పన్ను చెల్లించాల్సి ఉన్నా తప్పదు
  • ఏప్రిల్‌ 1 నుంచి మినహాయింపుల తొలగింపు
  • డొల్ల కంపెనీలను పసిగట్టేందుకే

దిల్లీ: డొల్ల కంపెనీలను మరింతగా అణచివేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా, రూ.3,000 వరకు పన్ను చెల్లించాల్సి వచ్చే కంపెనీలు ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్నులు దాఖలు చేయకుండా ఉన్న మినహాయింపును తొలగించనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్‌ 1) నుంచే ఈ మార్పు అమల్లోకి తేవాలన్నది ప్రతిపాదన. రిటర్నులు సమర్పించకపోతే ప్రాసిక్యూషన్‌కు అవకాశం కల్పించే ఐటీ చట్టంలోని నిబంధనకు 2018-19 బడ్జెట్‌ ప్రతిపాదన మరింత పదును పెట్టింది. దీని ప్రకారం, ఏప్రిల్‌ 1న ప్రారంభమయ్యే ఏదేని ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, రిటర్నులు గనుక వేయకపోతే, సంబంధిత కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌/డైరెక్టర్‌/నిర్వహణాధికారిని అందుకు బాధ్యులను చేస్తారు. ఇకపై ఆదాయపు పన్ను విభాగాలు, ఆయా కంపెనీల పెట్టుబడులను పరిశీలిస్తాయి. ఇకపై తక్కువ లాభం చూపుతున్న, తొలిసారిగా ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్న కంపెనీలపైనా, నిశిత పరిశీలన జరపాలని నిర్ణయించినట్లు ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

©2019 APWebNews.com. All Rights Reserved.